Uttarpradesh: 11 ఏళ్ల బధిర బాలిక అత్యాచారం.. కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

by Yella Dhawani Reddy |

చట్టాలు ఎంత కఠినతరం చేసిన ఆడవారిపై అఘాయిత్యాలు ఆగటం లేదు.

Uttarpradesh: 11 ఏళ్ల బధిర బాలిక అత్యాచారం.. కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: చట్టాలు ఎంత కఠినతరం చేసిన ఆడవారిపై అఘాయిత్యాలు ఆగటం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కామాంధులకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌‌లోని (Uttar Pradesh) రాంపుర్‌ (Rampur) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల బధిర (మూగ, చెవిటి) బాలికపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కనిపించటంలేదని మంగళవారం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో బాలిక నగ్నంగా, అపస్మారక స్థితిలో కనిపించింది.

వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మీరట్‌కు తరలించారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దాన్‌ సింగ్‌ (24) అనే వ్యక్తి బాలికను పొలాల్లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా, అతడు పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడి కాలికి గాయమైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story