రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది స్పాట్ డెడ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-03 07:30:14  IST  )

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన వెలుగుచూసింది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది స్పాట్ డెడ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు(ఆదివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన వెలుగుచూసింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలోని ఇటియా థోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పృథ్వీ నాథ్ ఆలయానికి వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది భక్తులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలువలో నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగ్రాతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. వాహనంలోని వారంతా మోతీగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిహాగావ్‌ వాసులుగా అధికారులు గుర్తించారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి..

ఈ విషాద ఘటన పై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వీడియో

Next Story