లాక్‌డౌన్‌లోనూ నేరాలు పెరిగాయ్

by  |
లాక్‌డౌన్‌లోనూ నేరాలు పెరిగాయ్
X

దిశ, నిజామాబాద్: మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. క్షణికావేశంలో మనుషులు మృగాలుగా మారుతున్నారు. వావి వరుసలను మరిచి విచక్షణ కోల్పోతున్నారు. నేరాలకు పాల్పడి తాము బలవడమే కాకుండా కుటుంబాలను సమిధలను చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచ మానవహక్కుల సంస్థ హింస పెరుగుతోందని చెప్పిన అంశాలు అక్షర సత్యాలు అవుతున్నాయి. జిల్లాలో ఈ నెలలో జరిగిన కొన్ని సంఘటనలు నేరాల విజృంభణకు పరాకాష్టగా నిలిచాయి. హత్యలు, అత్మహత్యలు, బలవన్మరణాలు పెరిగాయి. నిత్యం ఏదో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పలానా ప్రాంతంలో పలానా నేరం జరిగిందంటా.. అనే చర్చలు నిత్య కృత్య మయ్యాయి. హింసా ప్రవృత్తి పెరగడానికి మద్యం కూడా ఓ కారణమైంది. మద్యం మత్తులో తమను నమ్ముకున్నవారిని సైతం హతమార్చుతున్నారు. మానసిక వైద్యులు మాత్రం వాతావరణ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, మద్యం కారణంగానే నేరాల సంఖ్య పెరిగేందుకు కారణమని పేర్కొంటున్నారు.

ఈనెలలో జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలు..

* ఈనెల 2న నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసకొత్తూర్ గ్రామంలో గర్భిణి అయిన తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి అడ్డు చెప్పిన వియ్యంకుడు రాములును కొట్టి హతమార్చాడు. కొడుకు వచ్చిన తరువాత కోడలును తీసుకెళ్లాలని కోరిన పాపానికి వియ్యంకుడితో జరిగిన వాగ్వాదంలో అతడిని కొట్టి చంపాడు.

* 8న నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మందర్నలో సాయిరాం అనే వ్యక్తిని అతని భార్య గంగామణి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు, తల్లిదండ్రులు, పెద్దనాన్నతో కలిసి మట్టుబెట్టింది. ప్రేమించి పెళ్లిచేసుకున్నగంగామణి పరాయి వ్యక్తితో జరుపుతున్న సంబంధం విషయంలో పథకం ప్రకారం చంపి వాగులో పూడ్చిపెట్టిన సంఘటన మూడు రోజులకు వెలుగులోకి వచ్చింది.

* 14న కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం తిప్పాపూర్‌కు చెందిన గ్రామ వార్డు సభ్యుడు తాటిపల్లి మైలయ్య తన కూతురుపై కన్నేసి సొంత కొడుకు చేతిలో హతమయ్యాడు. తన సోదరిని తండ్రి లైంగికంగా వేధించడంతో కొడుకు గొడ్డలితో నరికి మైలయ్యను హతమార్చి పోలీసులకు లోంగిపోయాడు.

* 16న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బాలనర్సు, ప్రేమలతలు తమ వివాహేతర సంబంధం అందరికీ తెలిసి పోయిందని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. వేర్వేరు వ్యక్తులతో వివాహం చేసుకున్నవారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరు కుటుంబాలకు చెందిన పిల్లలు రోడ్డున పడ్డారు.


Next Story

Most Viewed