Rohit Sharma: రిటైర్మెంట్ ఆలోచనలో రోహిత్ శర్మ..!

by Malleboina Mahesh |   (  Updated:2026-07-17 06:38:10  IST  )

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్...? 2027 వరల్డ్ కప్ ప్రణాళికల్లో 'హిట్‌మ్యాన్' లేరని స్పష్టం చేసిన బీసీసీఐ.. లార్డ్స్ వన్డేనే ఆఖరి మ్యాచ్ కానుందా..?

Rohit Sharma:  రిటైర్మెంట్ ఆలోచనలో రోహిత్ శర్మ..!
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ వన్డే (ODI) కెరీర్ ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ.. పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా తాము యువ ఆటగాళ్లతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 39 ఏళ్ల రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరిగే 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని ఆశ పడినప్పటికీ.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కమిటీ మాత్రం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో, ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ బ్లూ జెర్సీలో రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రోహిత్ శర్మ ఇప్పటికే జూన్ 2024 లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీ20లకు, మే 2025లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటే ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పూర్తిగా ముగిసినట్లే అవుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఆయన ఫామ్ గ్రాఫ్ పడిపోవడం మైనస్‌గా మారింది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ తొలి రెండు వన్డేల్లో ఆయన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రిటైర్మెంట్ ప్రకటించే తుది నిర్ణయాన్ని సెలెక్టర్లు రోహిత్ శర్మ కోర్టులోనే పెట్టగా, లార్డ్స్ వన్డే అనంతరం 'హిట్‌మ్యాన్' తన భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story