- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు.. ఐసీసీ సంచలన నిర్ణయం!
క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ల ఫార్మాట్లలో ఐసీసీ భారీ మార్పులను ప్రకటించింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన వార్షిక సమావేశంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) చేసిన సిఫార్సుల మేరకు బుధవారం ఐసీసీ బోర్డు ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పోటీల స్థాయిని పెంచడం, అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.
2027 వన్డే ప్రపంచకప్: మూడు దశల సమరం!
వచ్చే 2027 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నప్పటికీ, ఈసారి టోర్నీని మూడు దశల్లో నిర్వహించనున్నారు. ప్రాథమిక రౌండ్.. చివరి మూడు స్థానాల్లో (12, 13, 14) ఉన్న జట్లు మొదట ఈ రౌండ్‌లో తలపడతాయి. ఇందులో విజేతగా నిలిచిన ఒకే ఒక్క జట్టు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. రెండో దశ (గ్రూప్ స్టేజ్).. మిగిలిన 11 జట్లతో పాటు సూపర్ సిరీస్ విజేత కలిసి మొత్తం 12 జట్లు ఈ దశలో పోటీపడతాయి. వీటిని ఆరేసి జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించి రౌండ్-రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సూపర్-7 స్టేజ్.. రెండు గ్రూపుల నుంచి టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక నాల్గవ స్థానం జట్టు.. మొత్తం 7 జట్లు ఈ దశకు చేరుకుంటాయి. ఇక్కడ ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
2028 టీ20 ప్రపంచకప్: కొత్తగా ‘సూపర్-10’ రౌండ్
2026 టీ20 ప్రపంచకప్‌లో అసోసియేట్ (చిన్న) జట్ల అద్భుత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, 20 జట్లతో జరిగే 2028 టోర్నీ ఫార్మాట్‌ను కూడా ఐసీసీ మార్చింది. గతంలో లాగా నాలుగు గ్రూపులు కాకుండా, ఈ సారి 5 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుండి టాప్-2 జట్లు ‘సూపర్-10’ దశకు చేరుకుంటాయి. సూపర్-10లో ఐదేసి జట్లతో రెండు గ్రూపులు ఉంటాయి. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా సెమీస్‌కు చేరుకుంటాయి. అయితే, రెండు గ్రూపుల్లో 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు ‘క్రాస్-ఓవర్ ఎలిమినేటర్’ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన మిగతా రెండు జట్లు సెమీస్ బెర్త్‌లను ఖరారు చేసుకుంటాయి.
క్వాలిఫికేషన్ రోడ్‌మ్యాప్
2028 టీ20 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ విధానాన్ని కూడా ఐసీసీ ఖరారు చేసింది. 2026 టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో చివరి నిమిషంలో వచ్చి ఆడిన స్కాట్లాండ్‌కు ఈసారి ఐరోపా ప్రాంతీయ ఫైనల్‌కు నేరుగా ప్రవేశం కల్పించారు. మిగిలిన జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, ఈ సరికొత్త ఫార్మాట్లకు సంబంధించిన వాణిజ్యపరమైన (కమర్షియల్) ప్రణాళికలపై నవంబర్‌లో జరిగే ఆర్థిక కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.






