- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మెట్రో' ప్రయాణికులకు మెరుగైన సేవలు
ప్రజలకు మరింత మెరుగైన సేవల ద్వారా హైదరాబాద్ మెట్రోను మరింత అభివృద్ధి చేయడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులకు సూచించారు....

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు మరింత మెరుగైన సేవల ద్వారా హైదరాబాద్ మెట్రోను మరింత అభివృద్ధి చేయడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రస్తుత మెట్రో కారిడార్ల నిర్వహణ, అభివృద్ధిపై ఆయన బుధవారం మెట్రో లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో కారిడార్లలో ప్రయాణీకుల సౌకర్యాలు, చివరి మైలు అనుసంధానం, భద్రత చర్యలు, పార్కింగ్, మెట్రో స్టేషన్ల శుభ్రత, ప్రయాణీకుల రద్దీకి తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలు, మొదలైన అంశాల గురించి అదనపు ఎండీ అజిత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ కూడా పాల్గొన్నారు. అదనపు బోగీలను ఏర్పాటు చేసే విషయంలో సంబంధిత తయారీదారులతో చర్చించి త్వరితగతిన వాటిని సమకూర్చుకునే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల సురక్షితమైన, సులభమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. మెట్రో లో రాకపోకలు సాగించే వారు గమ్యాలకు చేరుకోడానికి ఉన్న రవాణా అవకాశాలను చర్చించారు. వారి గమ్యస్థానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా అందుకు ప్రత్యేక రవాణా సదుపాయాలను సమకూర్చేలా వివిధ ప్రజా రవాణా సంస్థలతో చర్చలు జరపాలని అన్నారు. ఇప్పటికే చివరి మైలు కనెక్టివిటీ కి ఉన్న వాహన సదుపాయాల సేవలను మరింత విస్తరించాలని ఆయన తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని తగు మార్గాలను అన్వేషించాలని అదనపు ఎండీ అజిత్ రెడ్డి తెలిపారు.
మెట్రో స్టేషన్లతో అనుసంధానం…
మెట్రో స్టేషన్లతో అనుసంధానమై ఉన్న స్కై వాక్ ల నిర్వహణ, ఇంకా వాటి విస్తరణపై కూడా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల కు అనుసంధానమై ఉన్న స్కై వాక్ లు, సంబంధిత ఇతర మార్గాల నిర్వహణ గురించి కూడా రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మెట్రో రైల్ స్టేషన్ కి వచ్చే ప్రయాణీకులు ఎటువంటి గందరగోళం లేకుండా టికెట్ తీసుకుని ప్రశాంతంగా మెట్రో లో ప్రయాణించేలా మార్గాలను మరింత మెరుగు పరచాలని అజిత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మెట్రో స్టేషన్ కి స్థానిక ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లను ఎంపిక చేసుకుని, ఈ ప్రణాళిక ను అమలు చేసి, క్రమేణా మిగిలిన స్టేషన్లకు విస్తరించాలని ఆయన తెలిపారు.
పీఆర్టీఎస్ పై…
మెట్రో స్టేషన్ల నిర్వహణ, పని తీరుపై క్షేత్ర స్థాయిలో సమీక్షించడానికి త్వరలో తాను పర్యటనలు చేపడతానని ఆయన వెల్లడించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ముఖ్యంగా హైటెక్ సిటీ, రాయదుర్గ్, గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ ద్వారా ఏర్పాటు చేసే పర్సనల్ రాపిడ్ ట్రాన్స్ ఫోర్ట్ సిస్టం(పీఆర్టీఎస్) రవాణా వ్యవస్థ ప్రతిపాదనల ప్రగతిని సమీక్షించారు. స్టేషన్లలో భద్రతా చర్యలు, ప్రయాణీకుల సురక్షిత ప్రయాణానికి మెట్రో రైల్ భద్రతా విభాగం తీసుకుంటున్న చర్యలపై కూడా ఆయన చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్.రాజు, చీఫ్ సిగ్నలింగ్ అండ్ టెక్నికల్ ఇంజినీర్ స్వపన్ కుమార్ దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వై.సాయపరెడ్డి, జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ) శ్రీనాథ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.






