గోదావరి జలతాకిడికి మాయమవుతున్న శతాబ్దాల మర్రిచెట్టు

by Ratna Kumari |   (  Updated:2026-07-15 15:26:49  IST  )

మండలంలోని పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నది తీరాన వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన మర్రిచెట్టు కాలగర్భంలో కలిసిపోతోంది.

గోదావరి జలతాకిడికి మాయమవుతున్న శతాబ్దాల మర్రిచెట్టు
X

దిశ, మామడ : మండలంలోని పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నది తీరాన వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన మర్రిచెట్టు కాలగర్భంలో కలిసిపోతోంది. ఒకప్పుడు గ్రామస్థులకు, పరిసర గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన విశ్రాంతి కేంద్రంగా నిలిచిన ఈ చెట్టు నేడు గోదావరి జలతాకిడికి ఎండిపోయి కనుమరుగవుతోంది. ప్రకృతి అందాల నడుమ విస్తారంగా పెరిగిన ఈ మర్రిచెట్టు కింద గ్రామస్థులు, సందర్శకులు గంగ తెప్పలు తీసుకోవడం, కుటుంబాలతో విందు–వినోదాలు చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. పశువులకు సైతం ఈ చెట్టు చల్లని నీడను అందించేది. గ్రామ ప్రజల జీవితాల్లో ఈ చెట్టుకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది.

అయితే, గ్రామ సమీపంలో నిర్మించిన సదర్‌మట్ మినీ బ్యారేజ్ కారణంగా ఆ ప్రాంతంలో నీరు శాశ్వతంగా నిల్వ ఉండడంతో చెట్టు వేర్లు నిరంతరం నీటిలో మునిగిపోయాయి. దీంతో క్రమంగా చెట్టు పూర్తిగా ఎండిపోయి జీవం కోల్పోయింది. ఒకప్పుడు గ్రామానికి గుర్తింపుగా నిలిచిన ఈ శతాబ్దాల మర్రిచెట్టు నేడు ఎండిపోయిన దృశ్యాన్ని చూసి గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చెట్టు కింద గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలువురు అక్కడికి వెళ్లి తిలకిస్తున్నారు. స్థానికులు ఈ మర్రిచెట్టు ప్రకృతి వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని, ఇలాంటి విలువైన వృక్షాలను పరిరక్షించేందుకు భవిష్యత్తులో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Next Story