కంపెనీ నిర్ధారణతో వెలుగులోకి కల్తీ డీఏపీ వ్యవహారం..

by Batti.Sumithra |

మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో రాత్రి వేళల్లో విక్రయించిన డీఏపీ ఎరువుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కంపెనీ నిర్ధారణతో వెలుగులోకి కల్తీ డీఏపీ వ్యవహారం..
X

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో రాత్రి వేళల్లో విక్రయించిన డీఏపీ ఎరువుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో హుజూర్‌నగర్ వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) రవి నాయక్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. పరిశీలన అనంతరం రైతులకు విక్రయించిన ఎరువు కోరమండల్ కంపెనీ తయారు చేసిన అసలు డీఏపీ కాదని, అది కల్తీ ఎరువేనని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు ఏడీఏ రవి నాయక్ తెలిపారు. కంపెనీ ప్రతినిధుల నిర్ధారణ ఆధారంగా రైతులను మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. లైసెన్స్ లేకుండా రాత్రి వేళల్లో డీఏపీ ఎరువులను విక్రయించిన ప్రైవేట్ వ్యక్తి పిచ్చిరెడ్డి పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విచారణలో రైతులను తప్పుదోవ పట్టించి అధిక ధరకు కల్తీ ఎరువులు విక్రయించిన అంశం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపు లేని వ్యక్తుల వద్ద నుంచి, బిల్లు లేకుండా ఎరువులు కొనుగోలు చేయవద్దని అధికారులు రైతులను హెచ్చరించారు. లైసెన్స్ కలిగిన ఎరువుల విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద ఎరువులు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్, హుజూర్‌నగర్ ఏడీఏ రవి నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రావ్య, త్రివేణి, కోరమండల్ ఇంటర్నేషనల్ జోనల్ మేనేజర్ సుమన్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి తిరుమల రెడ్డి, అగ్రోనమిస్ట్ నిఖిల్ రెడ్డి, ఫీల్డ్ స్టాఫ్ శ్రీకాంత్, పోలీస్ కానిస్టేబుల్ విజయ్ తో పాటు బాధిత రైతులు పాల్గొన్నారు.

Next Story