గిల్ స్టన్నింగ్ క్యాచ్ హైలైట్.. ఆఫ్ఘాన్‌పై భారత్ బౌలర్ల ఆధిపత్యం

by Ramesh Naini |   (  Updated:2026-06-13 16:48:51  IST  )

ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయింది.

గిల్ స్టన్నింగ్ క్యాచ్ హైలైట్.. ఆఫ్ఘాన్‌పై భారత్ బౌలర్ల ఆధిపత్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘానిస్తాన్ జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 24.5 ఓవర్లలో 194 పరుగుల వద్ద కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యం నమోదైంది.

గుర్బాజ్ ఒంటరి పోరాటం..

ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తడబడింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (102; 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ హష్మతుల్లా (27)తో కలిసి నాలుగో వికెట్‌కు కేవలం 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించాడు. 15 ఓవర్లకు 140/3తో పటిష్టంగా కనిపించిన ఆ జట్టు, గుర్బాజ్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో ఒమర్జాయ్ (26) కాసేపు మెరిపించినా ఫలితం దక్కలేదు.

శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్

భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గూర్నూర్ బ్రార్, హర్ష్‌ దూబె అద్భుత ప్రదర్శన చేశారు. ఇద్దరూ చెరో 3 వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్ సింగ్, నితీశ్‌ రెడ్డి తలో రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించారు. ఇక హర్ష్‌ దూబె బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.

Next Story