‘నిర్మలమ్మ ఐదురోజుల ప్యాకేజీ రామాయణం అర్థం కాలే’

by  |
‘నిర్మలమ్మ ఐదురోజుల ప్యాకేజీ రామాయణం అర్థం కాలే’
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో ప్రజలందరినీ ఇళ్లలో ఉంచి బీజేపీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేందుకు సిద్ధమవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. రూ.20లక్ష కోట్ల ప్యాకేజీ అని దేశ ప్రధాని ఊరించి చివరకు రూ.3లక్షల కోట్లే ప్రత్యేక్షంగా లబ్దిచేకూరేలా వంచిచారని ఆయన విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీలతో ప్రజలకు ఉపశమనం కల్పించకుండా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రక్షణ రంగంలో 70 శాతం విదేశీ పెట్టుబడులును అనుమతించడం సిగ్గుచేటని అన్నారు. ఎయిర్, విద్య, బొగ్గు గనులను ప్రవేటీకరిస్తున్నామని ప్రకటించారు. కనీసం కేబినెట్, పార్లమెంటులో చర్చించకుండా ఈ నిర్ణయాలు ఎలా తీసుకున్నారని కేంద్రాన్ని నిలదీశారు. ప్రధాని మోడీ రూ.20లక్షల కోట్లు ప్రకటిస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రామాయణం సీరియల్‌గా ఐదు రోజులు చెప్పారన్నారు. చివరికి రామాయణంలో రాముడికీ సీత అమవుతుంది కానీ, ఆర్థిక ప్యాకేజీ మాత్రం అర్ధం కాని రీతిలో ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. వలస కార్మికులకు రూ.10 వేలు, 20 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. లాన్‌డౌన్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సాయం ప్రకటించేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు ఇవ్వాలని, చేనేత, ఇతర వృత్తి దారులను కూడా ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ, వలస కార్మికులను ఆదుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ శ్రేణులు కంటైన్మెంట్ లేని ప్రాంతాల్లో తహసీల్దారు కార్యాలయాలు, లేబర్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చాడ పిలుపు నిచ్చారు. సింగరేణి ప్రైవేటు పరం చేసే యత్నాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న సింగరేణి గనులు ఉన్న జిల్లాల్లో కార్మికులు చేపట్టే నిరసనలకు సంఘీభావంగా సీపీఐ శ్రేణులు పాల్గొనాలన్నారు.


Next Story

Most Viewed