‘ర్యాపిడ్’ గందరగోళం.. లక్షణాలున్నా నెగెటివ్..!

by  |
rapid test
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాధి లక్షలున్నప్పటికీ ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టుల్లో కొంత మంది రోగులకు నెగెటివ్ రిపోర్టు వస్తోంది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయడానికి ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బంది వెనకాడుతున్నారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 20 వేల టెస్టులు మాత్రమే చేయగలుగుతున్నారు. తగినంత మంది సిబ్బంది లేకపోవడం, తీసుకున్న శాంపిళ్ళను పరీక్షించడానికి ఎక్కువ సమయం పట్టడం లాంటి కారణాలతో చివరకు రిపోర్టు తయారుచేయడానికి నాలుగైదు రోజులు పడుతోంది. టెస్టులు చేయించుకునేవారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు లాబ్‌లలో సైతం అంతే సమయం పడుతోంది. అందుకే 24 గంటల్లో రిపోర్టు ఇవ్వలేమంటూ ముందుగానే పేషెంట్లకు చెప్పేస్తున్నాయి.

రాష్ట్రంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ సెంటర్లు 80 ఉన్నప్పటికీ రోజుకు 20 వేలకు మించి పరీక్షలను చేయలేకపోతున్నాయి. సిబ్బంది కొరత కారణం. రాష్ట్రంలో సుమారు 700 మంది ల్యాబ్ టెక్నిషియన్లు ఉన్నా అందులో 250 మందికి కరోనా సోకింది. ఫలితంగా రిపోర్టులు ఆలస్యమవుతున్నాయి. అందువల్లనే ప్రభుత్వం ఎక్కువగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను నిర్వహిస్తోంది. కానీ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులే వస్తున్నాయి. లక్షణాలున్నవారికి నెగెటివ్ వస్తే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని వైద్యారోగ్య శాఖ భావించినా ఆచరణాత్మక ఇబ్బందులతో చేయడంలేదు. నెగెటివ్ వచ్చిందనే ధైర్యంతో ఉండిపోతున్నారు. తెలియకుండానే వైరస్ క్యారియర్లుగా మారిపోతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఇబ్బందులు వచ్చినా నెగెటివ్ ఉందిగదా అనే ధైర్యంతో సీజనల్ ఫీవర్ అనుకుని సర్దుకుంటున్నారు. చివరకు వ్యాధి ముదిరి ఆస్పత్రులకు వెళ్ళాల్సి వస్తోంది.

టెక్నిషియన్లకు కరోనా..

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో 720 మంది ల్యాబ్ టెక్నిషియన్లు రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్నారు. రోజుకు సగటున పన్నెండు గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. పీపీఈ కిట్లు లాంటివి లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడంతో 250 మంది కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో టెస్టులు చేయడానికి సిబ్బంది కొరత ఏర్పడింది. అవసరమైనంత సిబ్బందిని ప్రభుత్వం నియమించడంలేదని, పనిభారంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఒక్కో టెస్టింగ్ సెంటర్‌లో ఆరుగురు ఉండాల్సి వచ్చినా కేవలం ఇద్దరితోనే నడిపిస్తున్నామని, రిపోర్టును కంప్యూటర్‌లో తయారుచేయడానికి ఆపరేటర్ కూడా లేరని ఓ టెక్నీషియన్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed