స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కోర్టు సమన్లు

by  |
Speaker Pocharam Srinivas Reddy
X

దిశ, క్రైమ్ బ్యూరో: శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వరమే తేల్చాలనే ఆదేశాలతో ప్రత్యేక విచారణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2005లో వరంగల్ సుబేదారి పీఎస్ పరిధిలో ఆందోళనకు దిగిన కేసు ఇటీవల వరంగల్ కోర్టు నుంచి హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యింది. ఈ క్రమంలో సోమవారం కేసు విచారణకు రావడంతో మార్చి 4వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, ఎస్.వేణుగోపాలాచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. మరో కేసులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు 2016లో చేపట్టిన ఆందోళనకు సంబంధించి జీడిమెట్ల పీఎస్‌లో నమోదయిన కేసులో మార్చి 8వ తేదీ వాయిదాకు హాజరు కావాలని సమన్లను జారీ చేసింది. ఈయన రాష్ట్రంలో లేరని కోర్టుకు సమాచారం ఇవ్వగా.. వివేకానందకు వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా సమన్లు పంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

దిగ్విజయ్ సింగ్‌కు నాన్ బెయిలబుల్..

కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2016లో ఎంఐఎంపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు హుస్సేన్ అన్వర్ కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై నమోదయిన కేసులను తేల్చేందుకు ఏర్పాటయిన ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసులో దిగ్విజయ్ సింగ్ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అనారోగ్య కారణాలతో రాలేకపోయారంటూ న్యాయవాది చెప్పిన మాటలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో దిగ్విజయ్ సింగ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. మార్చి 8వ తేదీ వాయిదాకు కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.


Next Story