నిబంధనలకు విరుద్ధంగా ‘కార్పొరేట్’ కథలు

136

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆదేశాల కంటే ముందే తరగతి గది బోధనలు ప్రారంభమయ్యాయి. తమను ఎవరూ ఏమీ చేయాలేరని కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు మరోసారి నిరూపించుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన తేదీకంటే ముందుగానే తొమ్మిది, పది క్లాసుల విద్యార్థులకు భౌతిక తరగతులు నిర్వహిస్తున్నాయి. కొవిడ్ నిబంధనల అమలుపై కూడా అనుమానాలే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసేలా జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు వచ్చే నెల ఒకటో తేదీన భౌతిక తరగతులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఈ నెల 18 నుంచి 25 వరకూ స్కూళ్లను శానిటైజేషన్ చేయడంతోపాటు కరోనా జాగ్రత్తలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలు గత మూడు రోజులుగా ఫిజికల్ క్లాసులు నిర్వహిస్తుండటం గమనార్హం.

శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఆన్‌రోల్ ఉపాధ్యాయులను ఈ నెల 18 నుంచి విధులకు హాజరవుతున్నారు. అదే రోజు నుంచి విద్యార్థులకు షిప్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి క్లాసులు ప్రారంభించి రోజూ రెండు సెషన్స్ చెబుతున్నారు. మరో ప్రముఖ విద్యాసంస్థ నారాయణ కూడా 15 రోజుల కింద నుంచే ఫిజికల్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ నెల 20వ తేదీ నాటికి 80 శాతం ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల లింక్‌ను కట్ చేస్తామని కూడా మెసేజ్‌లు పంపించింది. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంత యథేచ్ఛగా తరగతి గది బోధనలు నిర్వహిస్తున్నా జిల్లా విద్యాధికారులకేమీ తెలియనట్లుగా నటిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భౌతిక తరగతుల వల్ల పిల్లలు కొంతైనా నేర్పుకుంటారేమోనని పంపిస్తున్నట్టు పేరెంట్స్ చెబుతున్నారు.

ఫిర్యాదులొచ్చినా పట్టించుకోట్లే..

‘మరో పది రోజుల్లో అధికారికంగా స్కూళ్లను తెరిచేందుకు అనుమతి ఉన్నా కార్పొరేట్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు అందినా ఎలాంటి చర్యలు తీసుకునే స్థితి లేదు. దీన్ని కార్పొరేట్ యాజమాన్యాలు అలుసుగా తీసుకున్నాయి’ అని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పది నెలల తర్వాత స్కూళ్లను తెరుస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లలో శానిటైజేషన్ చేశారా? కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ పరిస్థితులు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించే వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు. కార్పొరేట్ స్కూళ్లు ఆ మేరకు చర్యలు తీసుకొని క్లాసులు ప్రారంభించారా? అంటే అది అనుమానమే. ప్రముఖ విద్యాసంస్థల్లోనే ఈ విధంగా ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర రాజధానిలోని కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో పట్టించుకునేవారే లేకుండాపోయారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..