అతడు కరోనాను జయించాడు..

by  |
అతడు కరోనాను జయించాడు..
X

దిశ, వెబ్‌డెస్క్ :
‘కరోనాకు చిన్న, పెద్ద అనే భేదం లేదు.. సెలబ్రిటీ, కామన్ మ్యాన్ అన్న తేడాల్లేవు.. పేద, ధనిక అనే తారతమ్యాలు కూడా తెలీదు. అందుకే ఎవరినీ వదలిపెట్డడం లేదు. అయితే చిన్నారులకు, వృద్ధులకు కరోనా సోకితే మాత్రం ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ తమ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో కరోనాను ఎదుర్కొన్న వృద్ధులు కూడా ఉన్నారు. కొందరు శతాధిక వృద్ధులతో పాటు పసిపాపలు కూడా కరోనాను జయించగలిగారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన 70 ఏళ్ల మైఖేల్‌కు కూడా కరోనా సోకింది. ఆ ఏడు పదుల వృద్ధుడు కూడా కరోనాతో పోరాడి చివరకు చావును జయించాడు. కానీ అతని ఆస్పత్రి బిల్లు చూస్తే మాత్రం.. గుండె ‘గుభేల్‌’మనక తప్పదు.

అమెరికా, సీటెల్‌కు చెందిన 70 ఏళ్ల మైఖేల్‌కు అనారోగ్యంగా ఉండటంతో.. మార్చి 4వ తేదీన ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి పలు టెస్టులతో పాటు కరోనా టెస్టు కూడా చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో అతనికి డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. ఒకానొక దశలో డాక్టర్లు.. అతడు చనిపోతాడని భావించి తన ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా ఇన్‌ఫార్మ్ చేశారు. కానీ అనూహ్యంగా మైఖేల్ కోలుకున్నారు. దాదాపు కరోనాతో 62 రోజులు పోరాటం చేసి మే 5న హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. కానీ అక్కడే అతనికి కరోనాను మించిన షాక్ తగిలింది. కరోనా చికిత్స కోసం 62 రోజుల పాటు ఆయనకు అందించిన సేవలతో పాటు హాస్పిటల్ బిల్లుగా ఏకంగా 1.1 మిలియన్ డాలర్లు వేశారు. అంటే దాదాపు మన కరెన్సీలో 8 కోట్ల 35 వేల రూపాయలు. 42 రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేసినందుకు రోజుకు 9,736 డాలర్ల చొప్పున, 29 రోజులు వెంటిలేషన్‌పై ఉంచినందుకు 82 వేల డాలర్ల బిల్ వేసింది. అయితే, అమెరికాలో వృద్ధుల కోసం ప్రభుత్వం కల్పించే ‘మెడికేర్‌ బీమా’ ఉండటంతో.. ఆ బిల్లు కవర్ అయ్యింది. హాస్పిటల్ బిల్లు మొత్తాన్ని మైఖేల్ కట్టాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. అందుకే అతణ్ని ఇప్పుడు అంతా ‘మిలియన్ డాలర్ బేబీ’గా పిలుస్తున్నారు.


Next Story