క‌రోనా భ‌యం గుప్పిట్లో న‌ల్ల‌గొండ‌ !

by  |
క‌రోనా భ‌యం గుప్పిట్లో న‌ల్ల‌గొండ‌ !
X

దిశ, న‌ల్ల‌గొండ‌: రోజు రోజుకు క‌రోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుండటంతో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో మగ్గుతున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు 15కు పెరగ‌డంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన 8మందికి, వీళ్లతో కాంట్రాక్ట్ అయిన నలుగురికి, నార్కట్‌ప‌ల్లిలో ఓ ప్రార్థన మందిరానికి వ‌చ్చిన ఇద్ద‌రు బ‌ర్మా దేశ‌స్తులు, సూర్య‌ాపేట‌ కుడ‌కుడకు చెందిన ఓ వ్యక్తికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు డీఎంహెచ్‌వో కొండ‌ల్‌రావు నిర్ధారణ చేయ‌డంతో ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జ‌ల‌కు టెన్ష‌న్ మొద‌లైంది. ఇంకా మరికొందరి కాంట్రాక్ట్ సభ్యుల రిపోర్టులు రావాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులతో పాటు, అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.

శనివారం సాయంత్రం నల్గొండ ప్రభుత్వాస్పత్రి ఐసోలేషన్ నుంచి నలుగురిని హుటాహుటిన హైద‌రాబాద్ ఫీవ‌ర్ ఆసుప‌త్రికి తరలించగా, 9,131 మందిని హోం క్వారంటైన్ చేశారు. న‌ల్ల‌గొండలోని ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్ బాగ్‌, బ‌ర్క‌త్‌పుర‌, మీర్‌బాగ్‌కాలనీ, మ‌న్యం చెల్క‌ల‌కు చెందిన ఐదుగురు, మిర్యాల‌గూడ మండ‌లం సీత‌రాంపురంలో ఓ మ‌హిళ‌, దామర‌చ‌ర్ల‌లో మరో మ‌హిళ‌, సూర్య‌ాపేట కుడ‌కుడలో ఒకరు, నార్కెట్‌ప‌ల్లి మ‌సీదుకు వ‌చ్చిన బ‌ర్మా దేశ‌స్తుల్లో ఇద్ద‌రికి పాజిటివ్ నిర్దార‌ణ కావ‌డంతో పోలీసులు కార్డెన్‌డౌన్ చేశారు. శుక్ర‌వారం 130మంది శాంపిల్స్ సేకరించి లాబ్‌కు పంపారు. శనివారం వచ్చిన 39 రిపోర్టుల్లో నలుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

7,832 మందికి స్ర్కీనింగ్‌

రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో కాంట‌ాక్ట్ పాజిటివ్ కేసుల కోసం వైద్యారోగ్యశాఖ అధ్వ‌ర్యంలో ర్యాపిడ్ స‌ర్వే లైన్స్ టీం స‌భ్యులు 200 మంది రంగంలోకి దిగారు. 1,922 ఇళ్లలో 7,832 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. అటు సూర్య‌ాపేట జిల్లా కుడ‌కుడలో పాజిటివ్ వచ్చిన వ్య‌క్తి ఢిల్లీ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన తర్వాత మొత్తం 33 మందిని క‌లిశాడు. ఇందులో 20 మందిని ఇప్ప‌టికే క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

మండ్ర‌లో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మండ్రలో హైస్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. టెన్త్ పరీక్షలప్పుడు విధులు నిర్వహించిన టీచర్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 60 మంది విద్యార్ధులు, 12 మంది టీచర్లు, విద్యార్థుల కుటుంబ స‌భ్యులు 200 మందికి వైద్య ప‌రీక్ష‌లు చేశారు. భ‌యాందోళ‌న‌కు గురువుతున్న ప్రజలను ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య క‌లిసి మ‌నో దైర్యం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. కాగా బర్మా దేశానికి చెందిన 15 మందితో పాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో ఇద్దరు.. మొత్తం 17 మంది జమాతే ప్రార్థనల కోసం నల్లగొండకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యాధికారులు 17మందిని నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉంచారు.

డ్రోన్ కెమెరాల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌

కరోనా పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. పోలీసు శాఖ మూడంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తోంది. న‌ల్ల‌గొండ ఎస్పీ రంగ‌నాథ్‌, సూర్య‌ాపేట ఎస్పీ ఆర్. భాస్క‌ర‌న్ అదేశాల మేర‌కు కార్డెన్‌డౌన్‌గా ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో ఇళ్ల నుంచి జ‌నం బ‌య‌కు రాకుండా ఉండేందుకు క‌ర్ప్యూ ప్ర‌క‌టించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు టెక్నిక‌ల్ టీంల‌ను ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలు అందించారు.

Tags: Corona virus, Nalgonda 15 cases, Suryapet, Narketpally, school students, Delhi, jamaat prayers, MLA Chirumarthi


Next Story