Corona: కరోనాపై ఫేక్ ప్రచారం.. సోషల్ మీడియా అత్యుత్సాహం

by Prasad Jukanti |   (  Updated:2025-06-03 05:55:26  IST  )

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్న దుష్ప్రచారం ప్రజలను మరింత ఆందోళన పెట్టేలా మారుతోంది.

Corona: కరోనాపై ఫేక్ ప్రచారం.. సోషల్ మీడియా అత్యుత్సాహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా ఈ వైరస్ బారిన పడి మరో ఐదుగురు మృతి చెందారు. వైరస్ కారణంగా నిన్న మహారాష్ట్రలో ఇద్దరు, కేరళ, బెంగాల్‌, తమిళనాడులో ఒకరు చొప్పున మృతిచెందారు. నిన్న 2700 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇవాళ వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో ఒకటి నిన్న కొత్తగా నమోదు అయింది. ఏపీలో ప్రస్తుతం 28 యాక్టివ్ కేసులు ఉండగా నిన్న ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజా పరిస్థితిపై తప్పుడు ప్రచారంతో కొంత మంది ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి.

లాక్ డౌన్ పై ఫేక్ ప్రచారం:

ప్రస్తుతానికి పరిస్థితి అంతా చేతిలోనే ఉన్నప్పటికీ కొన్ని యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాలు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ప్రజలను భయాందోళనలోకి నెట్టేలా ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా మళ్లీ లాక్ డౌన్ రాబోతున్నదంటూ ప్రజలు ప్యానిక్ అయ్యేలా ప్రచారానికి దిగుతున్నాయి. ఆసియా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరగడం గమనించిన భారత ఆరోగ్యశాఖ ఈ వైరస్ విషయంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేసులు పెరిగితే చికిత్స అందించేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేశాయి. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేశాయి. ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ రోజువారీ గణాంకాలను చూపిస్తూ భయాందోళనలు పుట్టించేలా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చేస్తున్న దుష్ప్రచారాన్ని పలువురు వైద్య రంగ నిపుణులు ఖండిస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదని ప్రజలను ఆందోళనలోకి నెట్టవద్దని సూచిస్తున్నారు.

ప్రమాదకరం కాదు:

ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరగడానకి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి క్షీణించడం ఒక కారణం కావొచ్చు అని ఇమ్యూనిటీ క్షీణించడం ద్వారా వృద్ధులు, రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తులు తిరిగి వైరస్ బారిన పడే అవకాశఁ ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 వేరియంట్‌, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంటున్నారు. అయితే ఇవి బాధితులపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి రుజువల్లేవని జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

Next Story