కరోనా కాలంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం

by  |
కరోనా కాలంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గురుకుల సొసైటీ విద్యాలయాల్లో స్టూడెంట్స్ కరోనా బారిన పడుతున్న ఘటన కలకలం సృస్టిస్తోంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి కారణంగా అన్ని స్థాయిల్లోనూ విద్యా బోధనకు బ్రేకులు పడ్డాయి. అయితే తెలంగాణలోని గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మాత్రం ప్రత్యేకంగా విద్యాబోధన సాగుతోంది. కాలేజీ స్టూడెంట్స్‌కు చదువు చెప్పేందుకు సొసైటీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇందుకు సమ్మతిస్తేనే విద్యాబోధన చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విల్లింగ్ లెటర్స్ తీసుకున్న తరువాతే విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. అయితే గత నెలలో కరీంనగర్‌లోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో కరోనా ప్రబలడంతో దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే చికిత్స అందించిన తరువాత పాఠశాలలో విద్యాబోధన చేయడం నిలిపివేశారు.

‘దోస్త్’ కోసం..

జగిత్యాల జిల్లా కోరుట్లలోని గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థులు 67 మందికి, ఏడుగురు టీచర్లు, ఒక వంట మనిషికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. డిగ్రీ ఫస్టియర్‌కు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వివరాలను ‘దోస్త్’లో అప్‌లోడ్ చేయడంతో పాటు సిలబస్‌కు సంబంధించిన బుక్స్‌ ఇవ్వాలని కాలేజీ అధ్యాపక బృందం నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీకి వచ్చిన విద్యార్థులు మూడు రోజులుగా అక్కడ ఉంటున్నారు. 295 మంది విద్యార్థులంతా కూడా కాలేజీ ఆవరణలోనే ఉండడంతో కరోనా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ప్రబలి ఉంటుందని భావిస్తున్నారు. ముందుగా కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాతే రావాలని స్టూడెంట్స్‌కు తాము సూచించామని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్తున్నారు. అనూహ్యంగా కరోనా పరీక్షలు చేయడం వారిలో 75 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగించిన విషయం.

పీజీ స్టూడెంట్స్.?

సంబంధిత కాలేజీ అధ్యాపక బృందం చెప్తున్న విషయంలో కొన్ని వాస్తవాలు దాచిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాలేజీకి వచ్చిన విద్యార్థుల్లో కేవలం ఫస్ట్ ఇయర్‌కు చెందిన వారే కాకుండా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వారు కూడా ఉన్నారని సమాచారం. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వీరిలో కొంతమంది స్టూడెంట్స్ ఈ కాలేజీలోనే ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం గురుకుల కాలేజీ ప్రతినిధులు మాత్రం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జాగ్రత్తలు ఏవీ.?

కొవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులు భౌతిక దూరం పాటించడం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కరోనా ప్రబలి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల చదువుకు ఆటంకం కాకుండా ఉండాలన్న సంకల్పంతో కాలేజీ అధికారులు తీసుకున్న నిర్ణయం సరైందే అయినప్పటికీ కొవిడ్ రూల్స్ అమలు చేసే విషయంలో దృష్టి సారించలేదెందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. దోస్త్‌లో వివరాలు నమోదు చేయడంతో పాటు బుక్స్ పంపిణీ చేస్తున్నందున జడ్సీఓలు కూడా పర్యవేక్షించాల్సి ఉంటే బాగుండేందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీ అధ్యాపకులకు విద్యార్థులకు సంబంధించిన వివరాలు సేకరించి, వారికి ఇవ్వాల్సిన బుక్స్ అప్పగించి వారిని ఇండ్లకు పంపిస్తే బాగుండేది. దోస్త్‌లో అప్‌లోడ్ చేసేందుకు సంబంధిత విద్యార్థులకు సైట్ వివరాలు చెప్తే సరిపోయేది కదా అంతమందిని ఒకసారి కాలేజీకి రమ్మనడానికి కారణం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలన్న కారణంతో విద్యార్థులందరినీ కాలేజీకి రప్పించి మూడు రోజుల పాటు అక్కడే ఉంచడం సరికాదని అంటున్నారు. వాస్తవంగా రెగ్యులర్ టీచింగ్ చేసేందుకే అంతపెద్ద సంఖ్యలో స్టూడెంట్స్‌ను కాలేజీకి రమ్మని పిలిచారన్న చర్చ కూడా విద్యాశాఖ వర్గాల్లో సాగుతోంది.



Next Story