ఇలా చేస్తే కరోనా వచ్చినా భయపడాల్సిన పనిలే!

by  |
ఇలా చేస్తే కరోనా వచ్చినా భయపడాల్సిన పనిలే!
X

ఓ ఉన్నత విద్యావంతుడికి శ్వాస సంబంధిత సమస్య వచ్చింది. కరోనా కావచ్చని అనుమానం. ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి టెస్టు చేయించుకున్నాడు. నెగిటివ్ అని స్పష్టమైంది. శ్వాస సమస్య పోవడం లేదు. కిమ్స్ లో చేరాడు. వాళ్లూ పరీక్షలు చేసి ఏమీ లేదని చెప్పారు. అయినా భయం పోలేదు. సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్తే భయంతోనే శ్వాస సమస్య తలెత్తినట్లు తేలింది. రవికుమార్ దంపతులు ఓ ఇంటిలో నివాసముంటున్నారు. వారి ఇద్దరు పిల్లలకు పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించారు. ఇంటి పెద్దాయన వద్దన్నా వచ్చి వారిని కలిశాడు. ఆ తర్వాత రెండు రోజులకే దంపతులకూ పాజిటివ్ అని తేలింది. అయ్యో.. ఇప్పుడేం చేయాలి? అంటూ రవికుమార్ ఆందోళన.

దిశ, న్యూస్ బ్యూరో: సమాజాన్ని కరోనా ఫోబియా వెంటాడుతోంది. కోవిడ్ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా చాలా మంది భయంతో బిక్కచచ్చిపోతున్నారు. పాజిటివ్ వచ్చినా ఈజీగా బయటపడుతామన్న ఆలోచన రావడం లేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ‘‘ఆయనకు పాజిటివ్ వచ్చిందట. ఆయనతో మొన్ననే నేను కలిసి మాట్లాడిన. నాకూ వస్తుందేమో’’ అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. కేసుల సంఖ్య నానాటికీ పెరగడం ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. చికిత్స పొంది సురక్షితంగా ఇళ్లకు చేరినవారి సంఖ్యనే ఎక్కువ. మృతుల సంఖ్య అత్యల్పం. కొందరు మాత్రం అపోహలు పెంచుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముందుగా ఆందోళన నుంచి బయట పడాలి. పాజిటివ్గా తేలినా అయ్యేదేం లేదన్న వాస్తవాన్ని గ్రహించాలి. భయాన్ని వీడితేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సైకియాట్రిస్టులు స్పష్టం చేస్తున్నారు. కరోనా గురించి అవగాహన చేసుకుంటే భయం దరి చేరదని చెబుతున్నారు.

ప్రతి ఆసుపత్రిలో కౌన్సెలింగ్

కరోనా చికిత్స అందించే దాదాపు అన్ని ఆసుపత్రులూ కౌన్సెలింగ్ విభాగాన్ని నిర్వహిస్తున్నాయి. మానసికంగా ఆందోళన చెందుతున్నవారికి సైకియాట్రిస్టులు ధైర్యం చెబుతున్నారు. కలవరా నికి కారణాలను తెలుసుకొని నివృత్తి చేస్తున్నారు. అలా కూడా కుదురుకోనివారికి చికిత్స కూడా చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో దీనికో ప్రత్యేక వ్యవస్థనే రూపొందించారు. రోజూ 10 నుంచి 15 కేసులను డీల్ చేస్తున్నట్లు పేషెంట్ కౌన్సిలింగ్, ఎడ్యూకేషన్ కమిటీ సభ్యురాలు, సైకియాట్రిస్టు డా.పింగళి శ్రీలక్ష్మి మంగళవారం ‘దిశ’కు వివరించారు. ఆందోళన చెందుతున్నవారిని గుర్తిస్తే ప్రాణాలను కాపాడొచ్చునని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మొదట ఒత్తిడిని తగ్గిస్తే సరిపోతుందంటున్నారు. చికిత్సకు దూరంగా ఉన్నోళ్లకే అనుమానాలు ఎక్కవ. అదే ఆసుపత్రికి వస్తే ఎలాంటి చికిత్స అందిస్తున్నారో, ఎలా బయట పడొచ్చో తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని అవగాహన లేని వ్యక్తులతో మాట్లాడి ముప్పు పొంచి ఉన్నట్లు ఊహించుకుంటున్నారని తెలిపారు.

కరోనా భయంతో ఆత్మహత్యలు

హైదరాబాద్‌లోని ఎంఎస్ మక్తాలో కరోనా భయంతో వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది. తమకు సోకిన వైరస్ కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డా రు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మోతే జనార్దన్ రెడ్డి (52) జీవనోపాధి కోసం హైదరాబాదులో ఉంటున్నాడు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా స్వగ్రామానికి చేరుకున్నాడు. స్థానిక ఎస్ఐ, తహశీల్దార్ ఆయనను ఇంట్లో నుండి బయటకు రావద్దని సూచించారు. జనార్దన్ రెడ్డి ఏం అనుకున్నాడో, ఏమో తెల్లారేసరికి ఉరి వేసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలో పాజిటివ్ రావడంతో మనస్తాపం‌ చెందిన మహిళ పురుగుల మందు తాగింది. వ్యవసాయశాఖలో అటెండర్గా పని చేసే మేకల సౌందర్య కొద్దిరోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దిగులు చెంది పురుగుల మందు తాగింది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఫణిరాజ్ (42), శిరీష (40) భార్యాభర్తలు. ఇటీవల వీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వారం రోజుల క్రితం ఫణిరాజ్ తల్లి కరోనాతో మృతి చెందింది. ఫణిరాజ్, శిరీష మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇవి మరింత ముదరడంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. భయంతోనే ఎయి మ్స్‌ బిల్డింగ్‌ నుంచి దూకాడని పోలీసులు చెప్పారు. భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన కొద్దిసేపటికే భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది.

కరోనా డెత్ రేట్ చాలా తక్కువ: డా.పింగళి శ్రీలక్ష్మి, సైకియాట్రిస్టు, గాంధీ ఆసుపత్రి కౌన్సెలింగ్ అండ్ ఎడ్యూకేషన్ కమిటీ సభ్యురాలు తెలంగాణలో కరోనా డెత్ రేట్ చాలా తక్కువ. ఆసుపత్రికి దూరంగా ఉన్నోళ్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డాక్టర్ దగ్గరికి వచ్చినోళ్లకు ఎలాంటి బాధ లేదు. గాంధీ ఆసుపత్రిలో రోజూ 10 నుంచి 15 మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఎలాంటి సమస్య లేకుండా చికిత్స చేస్తున్నాం. అపోహలను వీడాలి. ఎవరేది చెప్పినా నమ్మకూడదు. రూమర్స్ తోనే కరోనా రోగులకు సమస్య. పాజి టివ్ రాగానే నాకు ఎలా? నా కుటుంబం ఎలా? అన్న రెండు అంశాలపైనే సందేహాలు కలుగుతున్నాయి. దాంతో ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అవ గాహన లేని వ్యక్తులను సంప్రదించవద్దు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గాలనే అనుసరించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను అడగాలి. భయపడుతున్నవారికి కౌన్సెలింగ్ ఇప్పించా లి. ఒత్తిడితో కొందరికి నిద్ర పట్టదు. ఆకలి వేయదు. అలాంటి వాళ్లకు మెడిసిన్ తప్పనిసరి. మేం అదే చేస్తున్నాం. కౌన్సిలింగుతోనూ కోలుకోకపోతే చికిత్స చేస్తున్నాం.

ఫోబియాతోనే అసలు సమస్యగ: డా.శేఖర్ రెడ్డి, సైకియాట్రిస్టు, కిమ్స్ ఆసుపత్రి

ఏ లక్షణం కనబడినా కరోనాయోమోనని ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్ రాగానే చావేనన్న అపోహతో ఉన్నారు. కాలనీవాసులు, బస్తీవాసులు, గ్రామస్థులు ఏం అనుకుంటారో, ఎలా చూస్తారోనన్న గందరగోళం. ఇందుకే ఒత్తిడికి గురవుతున్నారు. కరోనాతో చనిపోయే వారు మల్టీపుల్ సమస్యలతో బాధ పడినవారేనని గుర్తించాలి. హెచ్ఐవీ సోకినప్పుడు ప్రతి ఒక్కరికీ కౌన్సె లింగ్ ఇచ్చేవారు. ఇప్పుడూ పోస్టు కరోనాలోనే కౌన్సెలింగ్ అవసరం. కరోనా నుంచి విముక్తి పొందాలంటే రోగ నిరోధక శక్తి అవసరం. భయంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మా దగ్గరికి వచ్చే వాళ్లలోనూ తీవ్రమైన ఒత్తిడిని గమనిస్తున్నం. కరోనా నుంచి బయట పడే మార్గం ఉంది. అవగాహన పెంచుకోవాలి. సమాజం వారిని వివక్షతో చూడొద్దు. చికిత్సతో బయట పడుతామన్న వాస్తవాన్ని గ్రహించాలి.

గెటప్, సెటప్ తోనే రెట్టింపు భయం: డా. భరత్ కుమార్ రెడ్డి, సైకియాట్రిస్టు, అపోలో ఆసుపత్రి

పాజిటివ్ రోగులకు ఆసుపత్రుల్లో గెటప్, సెటప్ లతోనే భయం రెట్టింపు అవుతుంది. రిసెప్షన్ నుంచి డాక్టర్ వరకు పీపీఈ కిట్లు ధరించడం, వాళ్లను దూరంగా పెట్టడం వంటి అంశాలు తీవ్రంగా భయపెట్టిస్తున్నాయి. కరోనా భయంతోనే వస్తున్నారు. వాళ్లకు ఈ వాతావరణం మరింతగా భయపెట్టిస్తోంది. మొదటిసారి ఆసుపత్రికి వెళ్లినవారిలో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటివారు కూడా వాళ్లను దూరంగా పెడుతుండడం భయాన్ని కలిగిస్తోంది. మానసిక రోగులతో మేం స్నేహపూర్వకంగా ఉంటాం. వీళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మాస్కులు ధరించడంతో ఫేస్ ఫీలింగ్స్ గుర్తించలేకపోతున్నాం. కౌన్సెలింగ్ ఫాలో అప్ ఉండడం లేదు. ఒత్తిడి తగ్గిందా లేదా అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. కుటుంబ సభ్యులు ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.


Next Story

Most Viewed