- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాక్సిన్ నో స్టాక్ అంటూ.. ఆసుపత్రుల్లో నయా దందా..!!
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో అసుపత్రుల్లో చేరేవారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్లు తప్పనిసరి ఔషధంగా మారాయి. దీని డిమాండ్‌ను గుర్తించిన కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు తగినంత స్టాక్ ఉన్నా కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు పరిస్థితిని గమనించి ఆకస్మిక తనిఖీలు చేస్తామంటున్నారు. పరిస్థితి తీవ్రతను, రెమిడెసివిర్ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం మూడు రోజుల […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో అసుపత్రుల్లో చేరేవారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్లు తప్పనిసరి ఔషధంగా మారాయి. దీని డిమాండ్‌ను గుర్తించిన కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు తగినంత స్టాక్ ఉన్నా కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు పరిస్థితిని గమనించి ఆకస్మిక తనిఖీలు చేస్తామంటున్నారు. పరిస్థితి తీవ్రతను, రెమిడెసివిర్ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం మూడు రోజుల క్రితమే అప్రమత్తమై తక్షణం మూడు లక్షలను సిద్దం చేసుకోవాల్సిందిగా వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఈ ఔషధం వినియోగం ఎక్కువగా ఉన్నదని, యుక్తవయసు గ్రూపు వారికి కూడా వైరస్ కారణంగా ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతోందని వైద్యులు పేర్కొన్నారు.
కరోనా సెకండ్ వేవ్ సామాన్యులను హడలెత్తిస్తూ ఉంటే కార్పేరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. గతేడాది అడ్మిషన్లు, ట్రీట్‌మెంట్ ద్వారా లక్షలాది రూపాయలను పేషెంట్ల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా ఈసారి రూటు మార్చి రెమిడెసివిర్ మాత్రలు, ఇంజెక్షన్లు స్టాకు లేవంటూ ఎక్కువ ధరకు బ్లాక్‌లో తెప్పించుకున్నామంటూ రెట్టింపు ఛార్జీలు వడ్డిస్తున్నాయి. “నగరంలో తగినంత స్టాక్ లేదు. మార్కెట్‌లో దొరకడం లేదు. మీ కోసం బ్లాక్‌లో తెప్పించక తప్పదు. పైగా ఇప్పుడు ఆర్డర్ ఇస్తే నాలుగైదు గంటల తర్వాత వస్తుంది. పది, పన్నెండు వేలు పెట్టాల్సి ఉంటుంది. ఇష్టమైతే తెప్పిస్తాం. లేదంటే పేషెంట్‌కు ఇబ్బందే.. “ లాంటి మాటలతో అందినకాడికి పేషెంట్ల నుంచి దోచుకునే మార్గానికి తెర లేపారు. కృత్రిమ కొరత వీరికి కాసులు కురిపించే వనరుగా మారింది.
సెకండ్ వేవ్ పరిస్థితిని అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా రెమిడెసివిర్ మాత్రలు, ఇంజెక్షన్లను తక్షణం సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ మేరకు స్టాక్ ఉందో వివరాలను సేకరించి వెంటనే మూడు లక్షలు సమకూర్చుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆ ప్రయత్నం జరుగుతుండగానే కార్పొరేట్ ఆసుపత్రులు కొత్త దందాకు పాల్పడడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం తెలంగాణ మార్కెట్‌లో ఎక్కువగా మైలాన్, హెటిరో, సిప్లా, రెడ్డీస్ లాబ్స్ తయారుచేసిన రెమిడెసివిర్ డ్రగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంజెక్షన్ (10 మి.లీ.) గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) మార్కెట్‌లో రూ. 5,400 ఉంటే కృత్రిమ కొరతతో అది రూ. 12 వేలు దాటిపోయింది.
రెండు వారాల్లో ఉత్పత్తి పెరుగుతుంది : అధికారి, డ్రగ్ కంట్రోల్ అథారిటీ
“కరోనా సమయంలో రెమిడెసివిర్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు మాకు ఫిర్యాదు రాలేదు. అదే నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. వెంటనే ఆకస్మిక తనిఖీలు చేపడతాం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు యాభై వేల స్టాక్ ఉంది. కంపెనీల నుంచి, డిపోల నుంచి నేరుగా ఆసుపత్రులకే ఇండెంట్ ప్రకారం సరఫరా చేయిస్తున్నాం. మెడికల్ షాపులకు సరఫరా ఉంటే జనం ఎగబడతారు, కొరత వస్తుందన్న ఉద్దేశంతో ఆసుపత్రులకే పంపాలనే నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో హెటిరో, మైలాన్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. హెటిరో సంస్థ రెండో యూనిట్‌కు అనుమతి జారీ చేశాం. రెండు వారాల్లో ఉత్పత్తి మొదలువుతుంది. కొరత వచ్చే అవకాశం ఉండకపోవచ్చు“.
సెకండ్ వేవ్‌లో రెమిడెసివిర్ అవసరం పెరిగింది : డాక్టర్ కృష్ణ, ఫిజిషియన్
“కరోనా వైరస్‌కు తొలుత ఊపిరితిత్తులే ప్రభావితమవుతాయి. కాబట్టి రెమిడెసివిర్ మంచి ఔషధం. గతేడాది దీని పనితీరు ఎలా ఉంటుందోననే సందేహాలు ఉండేవి. కానీ ఏడాది అనుభవం తర్వాత అది మంచి ఫలితాలను ఇచ్చిందనే నమ్మకం ఏర్పడింది. గతేడాది ఎక్కువగా వృద్ధులు, వ్యాధులతో బాధపడేవారు గురయ్యారు. సెకండ్ వేవ్‌లో మాత్రం ఎక్కువగా 22-50 ఏళ్ళ మధ్య వయసువారు వైరస్ బారిన పడుతున్నారు. ఈ ఏజ్ గ్రూపువారికీ ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం పడుతోంది. అనివార్యంగా రెమిడెసివిర్ వాడక తప్పడంలేదు. అందువల్ల ఆ డ్రగ్ వినియోగం పెరిగింది. పైగా దాని అవసరం కూడా ఉంది. వాడకానికి తగినంత స్టాక్ లేకపోతే పేషెంట్లకు ఇబ్బంది తలెత్తుతుంది“.






