రైతులను నట్టేట ముంచిన సీడ్ ఆర్గనైజర్..

by  |
రైతులను నట్టేట ముంచిన సీడ్ ఆర్గనైజర్..
X

దిశ, అశ్వారావుపేట: ఓ మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ రైతుల పాలిట శాపంగా మారాడు. ఫలితంగా ఆయన మాటల్లో పడి రైతులు మోసపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు పేద రైతులు అదే గ్రామానికి చెందిన మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ చేసిన మోసానికి ఆర్థికంగా నష్టపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల క్రితం వడ్లగూడెం, మర్రిగూడెం, రంగువారిగూడెం గ్రామాలకు చెందిన 50 మంది రైతులు ప్రో9(113) అనే మొక్కజొన్న సీడ్ విత్తనాలు సాగు చేయమని సీడ్ ఆర్గనైజర్ ప్రోత్సహించి, ఎకరాకు 5 టన్నుల పంట దిగుబడి అవుతుందని రైతులను నమ్మబలికాడు.

అయితే ఆర్గనైజర్ మాటలు నమ్మి సాగు రైతులకు ఎకరాకు టన్ను, రెండు టన్నులు కూడా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్గనైజర్ పై ఎదురు తిరిగారు. దీంతో మొక్కజొన్న సీడ్ కంపెనీ పెద్దలతో మాట్లాడి కొంత మంది రైతులకు నష్టపరిహారం ఇప్పించాడు. కానీ వడ్లగూడెం గ్రామానికి చెందిన తోకురి కృష్ణ, మద్దిరాల యేసు, తాయిల సూరయ్య, చక్రపు హరికిషోర్ అనే రైతులకు ఒక్క పైసా కూడా నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులు నాలుగు ఎకరాల లోపు సీడ్ మొక్కజొన్న సాగు చేశారు. సీడ్ కంపెనీ యాజమాన్యం రైతులకు నష్టపరిహారం చెల్లించమని ఆర్గనైజర్ బ్యాంకు ఖాతాలో 6 లక్షల 13 వేలు జమ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆర్గనైజర్ కూడా ఎనిమిది ఎకరాలు సాగు చెయ్యడంతో ఆ సొమ్ములో ఎక్కువ భాగాన్ని తనకు నష్టపరిహారంగా ఉంచుకోని ఈ పేద రైతులకు మొండి చెయ్యి చూపాడు. తమను మోసం చేసిన సీడ్ ఆర్గనైజర్ నుండి కంపెనీ తమకు చెల్లించమని బ్యాంకు ఖాతాలో వేసిన సొమ్మును తమకు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ సమస్యపై ఆర్గనైజర్‌ను సంప్రదించగా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఆ నలుగురు రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని బదులిచ్చాడు, కానీ రైతులకు మాత్రం తమకు నష్టపరిహారం ఇవ్వనని, మీకు చేతనైంది చేసుకోమని, చెప్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed