వివాదాలకు కేంద్రంగా టీఎస్ విద్యుత్ సంస్థలు…..

by  |
వివాదాలకు కేంద్రంగా టీఎస్ విద్యుత్ సంస్థలు…..
X

హైదరాబాద్… తెలంగాణలోని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎస్పీడీసీఎల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. సంస్థ ఉన్నతాధికారులపై అందులో పనిచేసే ఉన్నతస్థాయి ఉద్యోగులే తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పడి నుంచి ఇప్పడిదాకా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌తో పాటు విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని కార్పొరేషన్లకు నాన్ ఐఏఎస్‌లే సారథ్యం వహిస్తున్నారు. వీరంతా నేరుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సంస్థలను నడుపుతున్నారననేది అందరకి తెలిసిన విషయమే. ఈ శాఖకు మంత్రి ఉన్నా అది నామమత్రమే అన్నట్లు తయారైంది. దీంతో శాఖలో, ఈ శాఖ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లైన టీఎస్‌జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్‌‌‌‌పీడీసీఎల్, టీఎన్‌పీడీసీఎల్ కార్పొరేషన్ల వ్యవహారాల్లోనూ పూర్తి పారదర్శకత లోపించింది. నిజానికి ఇవన్నీ కంపెనీ చట్టం కింద ఏర్పాటైన కార్పొరేషన్లే. వీటి వార్షిక ఆర్థిక వ్యవహారాలు, అప్పులు, పెట్టుబడులు అన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వార్షిక నివేదికల రూపంలో విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ వాటికి ఇంతవరకు అతీగతి లేదు. ప్రస్తుతం నడుస్తున్న 2019-20 ఆర్థిక సంవత్సరం ఈ మార్చితో ముగుస్తుంది. కానీ విద్యుత్ శాఖలోని ఏ కార్పొరేషన్‌కు సంబంధించిన 2018-2019 వార్షిక నివేదిక కూడా ఇప్పటికి బయటికి రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కరెంటు డిమాండు పెరుగుతుండడం, పెరిగిన కరెంటునంతా వేల కోట్ల రూపాయలు పెట్టి బయటినుంచే కొంటుండడంతో విద్యుత్ శాఖ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించడం వివాదాస్పదమవుతోంది.

కోటేశ్వర్‌రావు సస్పెన్షన్‌తో వార్తల్లో టీఎస్పీడీసీఎల్….

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన అడిషనల్ ఇంజనీర్ కోటేశ్వర్‌రావు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. సంస్థలో జరిగే పనులకు కాంట్రాక్టులు ఏ మాత్రం పారదర్శకత పాటించకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు కోటేశ్వర్‌రావు ఆరోపించారు. సంస్థ ఎండీ రఘుమారెడ్డిపై ఏకంగా ఫేస్ బుక్ లైవ్ పెట్టి మరీ అవినీతి ఆరోపణలు చేశారు. రఘమారెడ్డిపై విచారణ జరపాలని సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు. దీంతో కోటేశ్వర్‌రావును సంస్థ నియమనిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్లు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటి వరకు కూడా కోటేశ్వర్‌రావు చేసిన ఆరోపణలపై సంస్థ ఎండీ అధికారికంగా స్పందించలేదు. ఇలా సంస్థలో జరిగే విషయాలను బయటపెట్టిన అధికారిని సస్పెండ్ చేయడాన్ని గమనిస్తే తెలంగాణ విద్యుత్ శాఖ, ఆ శాఖలోని కార్పొరేషన్లు ఎంత గోప్యంగా వ్యవహారాలు నడుపుతున్నాయో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


Next Story

Most Viewed