పెగాసస్‌పై పార్లమెంటులో రచ్చ, రచ్చ

by  |
పెగాసస్‌పై పార్లమెంటులో రచ్చ, రచ్చ
X

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఉభయ సభల్లో పెగాసస్‌పై రచ్చ జరుగుతున్నది. పౌరులు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలపై నిఘా వేశారన్న కథనాలను పేర్కొంటూ స్పైవేర్ చర్చించాలని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు్న్నది. తాజాగా, పెగాసస్ అనేది అసలు ఇష్యూనే కాదని, దానిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం సరికాదని గురువారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిపై నిఘా వేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏం చెప్పదలుచుకున్నారని అడిగారు. అసలు ఆయనకేమీ అర్థం కాదని, అదే అసలు సమస్య అని విమర్శించారు. పరిపక్వత లేని మాటలు మాట్లాడుతుంటారని అన్నారు. పెగాసస్‌పై చర్చను ఆది నుంచీ డిమాండ్ చేయడం, ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టలేకపోవడం తంతుగా మారింది.

ఈ తరుణంలో గురువారం ఉదయం కేంద్ర మంత్రులు పియూశ్ గోయల్, ప్రహ్లాద్ జోషిలు ప్రతిపక్షాలతో భేటీ అయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేల సహకరించాలని, బిల్లులు ప్రవేశపెట్టడానికి తగిన వాతావరణానికి కట్టుబడాలని కోరారు. ఆ భేటీలోనూ విపక్ష నేతలు పెగాసస్‌పై చర్చను డిమాండ్ చేశారు. అనంతరం మొదలైన సమావేశాల్లో ఎప్పటిలాగే ప్రతిపక్షాలు నిరసనలు ప్రారంభించడంతో లోక్‌సభ స్పీకర్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. సభ్యులు పదే పదే సభా మర్యాదను తుంగలో తొక్కుతున్నారని, ఇదే పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షాల తీరులో మార్పు లేకపోవడంతో ఉభయ సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి. ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగానే లోక్‌సభలో ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సవరణ బిల్లు, ఇన్‌లాండ్ వెస్సల్స్ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లులు పాస్ అయ్యాయి. ఫ్యాక్టోరింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఒకవైపు సభల్లో నిరసనలు చేపడుతూనే పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర కూడా విపక్ష నేతలు గురువారం అగ్రి చట్టాలు, పెగాసస్‌ అంశాలపై నిరసనలు చేశారు.

పార్లమెంటు ప్యానెల్‌లో పింగ్ పాంగ్ మ్యాచ్: శశిథరూర్

పెగాసస్ ఆరోపణలపై అధికారులను ప్రశ్నించడానికి సిద్ధమైన పార్లమెంటరీ ప్యానెల్(ఐటీ)కి కాంగ్రెస్ నేత శశిథరూర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్యానెల్‌ను పింగ్ పాంగ్ మ్యాచ్‌కు కుదించారని బీజేపీ ఎంపీలపై శశిథరూర్ గురువారం విమర్శలు చేశారు. ఇది పార్లమెంటరీ స్పిరిట్‌కు విరుద్ధమని అన్నారు. బుధవారం ఈ ప్యానెల్‌ అధికారులను ప్రశ్నించాల్సింది. కానీ, సభ్యులు సహకరించకపోవడంతో సాధ్యపడలేదని ఆయన వివరించారు. ప్యానెల్ సమావేశానికి హాజరైన నేతలు కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే లేదా నిరసనగా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టలేదు. దీంతో విచారణ ప్రారంభించడానికి ప్యానెల్‌లో ఉండాల్సినంత మంది సభ్యులు లేరు. ఫలితంగా విచారణ వాయిదా పడింది. ఈ పరిణామం బాధాకరమని శశిథరూర్ అన్నారు.


Next Story