ఆ పని చేయొద్దంటూ సర్పంచ్‌ను సతాయిస్తున్న తహసీల్దార్‌

by  |
ఆ పని చేయొద్దంటూ సర్పంచ్‌ను సతాయిస్తున్న తహసీల్దార్‌
X

దిశ, చందుర్తి: చందుర్తి మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం తహసీల్దార్ నరేష్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ గ్రామ సర్పంచ్ ఆరోపిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం కోసం గ్రామంలోని కర్ణంకుంటలో ఇచ్చిన స్థలం అనువైనది కాదని.. వేరే చోట ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని గతంలో కోరినప్పుడు ఇవ్వలేదన్నారు. తాను చూపిన స్థలంలోనే పల్లె ప్రకృతి వనం నిర్మించాలని చెప్పగా.. ప్రస్తుతం ఆ స్థలంలో రూ. 4 లక్షలతో పనులు మొదలుపెట్టామన్నారు. తీరా పనులు పూర్తయ్యే సమయంలో మళ్లీ స్థలం మార్చాలని తహసీల్దార్ ఒత్తిడి చేస్తున్నారని సదరు సర్పంచ్ వాపోతున్నాడు. చివరకు బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తహసీల్దార్ వివరణ..

ఇక ఇదే విషయంపై తహసీల్దార్ నరేష్‌‌ని దిశ ప్రతినిధి వివరణ కోరగా.. ‘కర్ణంకుంటలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం అప్పట్లో స్థలం కేటాయించడం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయొద్దని నాయకుల ఒత్తిడి పెరిగింది. దీంతోనే ఆపివేస్తున్నాం. దానికి బదులుగా 176 సర్వే నెంబర్‌లో పది ఎకరాల భూమిని కేటాయించడం జరుగుతున్నది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న చోట పనులు నిలిపివేసి, 176 సర్వేనెంబర్‌లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, వరి ధాన్యం ఆరబోయడానికి కూడా అదే 176 సర్వేనెంబర్‌లో ఐదు ఎకరాలు కేటాయిస్తాము. కానీ, కొంతమంది నాయకులు, చివరకు ఎమ్మెల్యే కూడా కర్ణంకుంట భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయవద్దని ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవు, గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన చోట స్థలం ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా రాజకీయ నాయకులు ఆధిపత్య పోరు కోసం ప్రయత్నిస్తున్నారు తప్పా.. గ్రామ అభివృద్ధి పనులు చేయడంలో పోటీ పడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకులు ఆధిపత్య పోరు వీడి ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం తీర్మానించిన చోటే పల్లె ప్రకృతి వనం నిర్మించాలని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.


Next Story