రాజయ్యను గెంటేసి.. మల్లారెడ్డిని అక్కున చేర్చుకుంటారా : షర్మిల

by  |
రాజయ్యను గెంటేసి.. మల్లారెడ్డిని అక్కున చేర్చుకుంటారా : షర్మిల
X

దిశ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ద‌ళితులపై కేసీఆర్‌ స‌వ‌తి తల్లి ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజ‌య్యపై ఆరోప‌ణ వ‌చ్చిన వెంట‌నే అర‌క్షణం ఆలోచించ‌కుండా ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని, అదే కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డిపై వంద‌ల కొద్దీ వ‌స్తున్నా అత‌డిని మాత్రం బ‌ర్తర‌ఫ్ చేయ‌కుండా అక్కున చేర్చుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శన‌మ‌ని సీఎం కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కు ద‌ళితుల‌పై ఎంత‌ప్రేమ ఉందో ఇక్కడే తెలుస్తోంద‌ని ప్రభుత్వంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

లోట‌స్ పాండ్ లో బుధ‌వారం నిర్వహించిన అంబేడ్కర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి పాల‌కుల‌కు ద‌ళితుల‌పై చిత్తశుద్ది లేద‌న్నారు. అణ‌గారిన వ‌ర్గాల‌ను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నార‌న్నారు. ఏ ద‌ళితుడు సీఎం చేయ‌మ‌ని కేసీఆర్‌ను అడ‌గ‌లేదని, దొర‌గారే హామీలిచ్చి మాట త‌ప్పార‌ని ష‌ర్మిల ఘాటు విమ‌ర్శలు చేశారు. మూడెక‌రాల భూమి, డ‌బుల్ ఇండ్లు, రిజ‌ర్వేష‌న్ల శాతం పెంచుతామ‌ని కేసీఆర్ హామీలిచ్చి ద‌గా చేశార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌థ‌కాలన్నీ పేద‌ల‌కు అందుతున్నాయా సీఎం సారూ అంటూ ప్రశ్నించారు.

అంబేడ్కర్ పై ఉన్న గౌర‌వంతో వైఎస్సార్ ప్రాణ‌హిత ప్రాజెక్టుకు అంబేడ్కర్ ప్రాణ‌హిత చేవెళ్ల అని పేరు పెడితే అది న‌చ్చని కేసీఆర్.. రీడిజైన్ పేరిట ఖ‌ర్చు వ్యయాన్ని 1.35 ల‌క్షల కోట్లకు పెంచి అవినీతికి పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఐదేళ్ల క్రితం అంబేడ్కర్ 125వ జ‌యంతిన కేసీఆర్ ట్యాంకుబండ్ వ‌ద్ద 125 అడుగుల విగ్రహాన్ని పెడ‌తామ‌ని మాట త‌ప్పార‌ని అన్నారు. నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల‌కు కొవిడ్ నిబంధ‌న‌లుండ‌వు, కానీ అంబేడ్కర్ జ‌యంతికి మాత్రం రూల్స్ అడ్డుగా వ‌స్తాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్

రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని, వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేర్చడంలో రాజ్యాంగం ఎంతో ఉపయోగపడింద‌ని ష‌ర్మిల అన్నారు. ఆయన అడుగుజా‌డల్లోనే మహానేత వైస్సార్ నడిచారని పేర్కొన్నారు. అందుకోసం పేదల కోసం ఉచిత విద్య, వైద్యం ప్రవేశపెట్టారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కమిషన్లు ఏర్పాటు చేసి ఆదుకున్న ఘనత వెఎస్సార్ కు దక్కిందన్నారు. అంతేకాకుండా వారికి 6 ల‌క్షల ఎక‌రాల భూపంపిణీ చేసింది త‌న తండ్రేన‌ని ఆమె గుర్తుచేశారు. ద‌ళితులని చిన్నచూపు చూడొద్దని, రాజ‌న్న సంక్షేమాన్ని అంద‌రికీ అందించి ఆత్మగౌర‌వంతో బ‌తికేలా చేస్తాన‌ని ఆమె పేర్కొన్నారు.


Next Story

Most Viewed