షాకింగ్ జీవో.. 33 కాదు.. తెలంగాణలో 10 జిల్లాలే!

by  |
Civil Supplies Department, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సత్వరం మెరుగైన సేవలు అందించేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. పది జిల్లాల తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాలుగా మారింది. అన్ని జిల్లాలకూ కలెక్టర్లు కూడా ఉన్నారు. కానీ, కొన్ని అంశాల్లో ప్రభుత్వం ఇంకా పది జిల్లాలు అనే తీరులోనే వ్యవహరిస్తున్నది. తాజాగా జారీ చేసిన ఒక జీవోను కూడా 10 జిల్లాలకే వర్తింపజేసింది. కొత్త జిల్లాలను రిజర్వు బ్యాంకు, నీతి ఆయోగ్ లాంటివన్నీ గుర్తించాయని, కేంద్ర నిధులు కూడా ఆ ప్రకారమే వస్తున్నాయంటూ 2017లోనే సీఎం అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలిపిన కొత్త జోనల్ విధానం కూడా 33 జిల్లాలకూ వర్తిస్తున్నది. దాని ఆధారంగానే ఉద్యోగుల విభజన, మంజూరైన పోస్టులు, పదోన్నతులు, ఖాళీ పోస్టుల గుర్తింపు తదితర ప్రక్రియలు జరుగుతున్నాయి. ఇకపై విడుదల చేయబోయే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఆ ప్రకారమే ఉండనున్నాయి. కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చి ప్రభుత్వ విధానాలన్నీ అమలవుతూ ఉంటే తాజాగా పౌరసరఫరాల శాఖ జారీ చేసిన జీవో మాత్రం పది జిల్లాలకు మాత్రమే వర్తించేలా రూపొందించింది.

పూర్వ జిల్లాల్లో వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్లను ఏర్పాటుచేస్తూ ఆ శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ అనిల్ కుమార్ అక్టోబరు 12న జీవో జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిధి పూర్వ జిల్లాల కమిషన్ల కిందకే వస్తుందని పేర్కొన్నారు. వీటికి అదనంగా రాష్ట్రస్థాయి కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో కొత్త జిల్లాలను పౌరసరఫరాల శాఖ నిరాకరిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను గౌరవించడంలేదనే భావన కలుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో తీసుకొచ్చిన వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం దేశంలోని ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కన్స్యూ మర్ రీడ్రెస్సల్ కమిషన్ ఉండాలి. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా మరో ఇద్దరు సభ్యులతో ఇది పనిచేయాలి. ఆ ప్రకారం తెలంగాణలోనూ 33 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కమిషన్లు ఏర్పడాల్సి ఉన్నది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం పూర్వ పది జిల్లాల్లో మాత్రమే కమిషన్లను నియమిస్తూ జీవో జారీ చేసింది.

కన్స్యూమర్​ కమిషన్ల ఏర్పాటుతో..

ప్రతి కొత్త జిల్లాలో ఇలాంటి కన్య్సూమర్ కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక ఆఫీసును నెలకొల్పడం, అది పనిచేయడానికి వీలుగా కొద్దిమంది సిబ్బందిని నియమించడం, ప్రతి నెలా నిర్వహణ కోసం కొంత నిధిని విడుదల చేయాల్సి రావడం తదితరాల కారణంగా ప్రభుత్వం పూర్వ జిల్లాలకు మాత్రమే ఈ వ్యవహారాన్ని పరిమితం చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్వ జిల్లాలకు మాత్రమే కమిషన్లను ఏర్పాటు చేసి కొత్త జిల్లాలను మళ్లీ వాటి కిందికి తీసుకెళ్ళడం ద్వారా ప్రజలంతా వారి అవసరాల కోసం మళ్లీ పాత జిల్లాల బాట పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

జీవో ప్రకారం.. కన్సూమర్ కమిషన్లు, వాటి పరిధిలోకి వచ్చే కొత్త జిల్లాలు..

ఆదిలాబాద్ : ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్,
కరీంనగర్ : కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల
ఖమ్మం : ఖమ్మం, కొత్తగూడెం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల
మెదక్ (సంగారెడ్డిలో) : మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి
నల్లగొండ : నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి
నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి
రంగారెడ్డి : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్
వరంగల్ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు
హైదరాబాద్ : మూడు జిల్లా కమిషన్లు (వీటి పరిధిని రాష్ట్ర కమిషన్ వర్క్ డివిజన్ చేయనున్నది)



Next Story

Most Viewed