బదిలీల కోసం ఎదురు చూపులు

by  |
బదిలీల కోసం ఎదురు చూపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు పదేండ్లకు పైగా బదిలీలకు నోచుకోని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎదురుచూపులకు స్వరాష్ట్రంలో కూడా మోక్షం కలుగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పదమూడేండ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకే చోట కనిష్టంగా మూడేండ్లు, గరిష్టంగా ఐదేండ్లు మాత్రమే పనిచేయాలని నిబంధనలు చెబుతున్నా.. పదమూడేండ్లలో ఒక్కసారి కూడా బదిలీలు లేక కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇబ్బందులు పడుతున్నారు. సొంత జిల్లాలకు వందల కిలోమీటర్ల దూరంలో కాలేజీల్లో విధులు నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాల దృష్టికి వేల సార్లు సమస్యను తీసుకెళ్లినా ఏ ఒక్కరూ పరిష్కరించడం లేదు.

బదిలీలు కోరుతున్న ఉపాధ్యాయుల సొంత ప్రాంతాల్లోనే 25 – 30 కిలోమీటర్ల పరిధిలోనూ ఖాళీలున్నాయి. 2011 – 2019 మధ్య జరిగిన పలు బదిలీల సందర్భాల్లో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఒక ఉద్యోగి ఒకే చోట అనేక సంవత్సరాలుగా ఉద్యోగులు చేయడం చట్టవిరుద్ధమేగాక అది విద్యార్థుల బోధన మీద, కళాశాలల నిర్వాహణపై ప్రభావం చూపుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఒకే రకమైన విద్యాబోధన విధానం వల్ల విద్యార్థుల్లో కొత్తదనం లోపిస్తుందని రాష్ట్ర విద్యా పరిశోధనమండలి స్పష్టం చేస్తోంది.

రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,728 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. జోనల్ స్థాయిలో నియామకాలు జరిగినా కాంట్రాక్ట్ లెక్చరర్లకు తిరిగి బదిలీల అవకాశం ఇవ్వకపోవడంతో వారంతా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కొందరు 13 ఏండ్లుగా కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు పిల్లలతో సహా ఉద్యోగం చేస్తున్నవారిలో భవిష్యత్‌లో జోనల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకేచోట పనిచేసే ఉద్యోగుల జీతాలు, ఆర్జిత సెలవులు, అవకాశాల్లోనూ వేర్వేరుగా ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కోలేకపోతున్నామంటూ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు. 2020 నవంబర్ 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బదిలీలు చేపట్టాలని సూచించారు. అయినా ఇప్పటికీ అమలుకు నోచుకులేదు. ప్రభుత్వానికి భారం లేకపోయినా, సీఎం ఆదేశించినా అధికారులు ఎందుకు బదిలీ ప్రక్రియ చేపట్టలేదో తెలియడం లేదని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్ట్ పేరుతో హక్కులు కాలరాస్తున్నారు: ఎం. రజిత, ఎంఎల్‌టీ లెక్చరర్, అసిఫాబాద్

మాది వరంగల్ సొంత జిల్లా కేంద్రం. హన్మకొండ జూనియర్ కాలేజీ మా ఇంటి నుంచి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇప్పుడు నేను డ్యూటీ చేస్తున్న కాలేజీ 350 కిలోమీటర్లు. అసిఫాబాద్ జిల్లా కౌతాల ఒకేషనల్ కాలేజీలో పదకొండేండ్లుగా పనిచేస్తున్నాను. కుటుంబానికి దూరంగా ఇన్నేండ్లు పని చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళా టీచర్లు నాలాగా పనిచేస్తున్నారు.

ఈ సారైనా బదిలీలు చేపట్టాలి: చంద్రశేఖర్, తెలుగు అధ్యాపకులు, నిజామాబాద్

2012లో ప్రభుత్వం ఓ అక్రమ సర్క్యూలర్ ద్వారా బదిలీలు చేసింది. అందులో భాగంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చి వేశారు. సుమారు తొమ్మిదేండ్ల నుంచి సొంతింటికి దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం గద్వాల జిల్లాలోని ‘గట్టు’ ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే పట్టించుకునేందుకు సొంత మనుషులు లేరు. మా ఇల్లు ఇక్కడ నుంచి 360 కిలోమీటర్లు. వచ్చే జూన్ నుంచి కొత్త స్థానాల్లో చేరేలా చేసినా ఉపశమనం కలుగుతుంది.


Next Story

Most Viewed