కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!

46

దిశ, వెబ్ డెస్క్: కేరళలో కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం మిత్రపక్షంగా సాగిన కాంగ్రెస్(ఎం), వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్‌లోకి చేరడానికి నిర్ణయం తీసుకుంది. క్రైస్తవుల ప్రాబల్యం గల కేరళ కాంగ్రెస్(ఎం) నేత జోస్ కే మణి ఈ మేరకు బుధవారం ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నామినేషన్‌పై గెలిచిన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించారు.

కాంగ్రెస్(ఎం)లో అంతర్గత వర్గపోరు నేపథ్యంలో జోస్ కే మణి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2019లో కన్నుమూసిన కాంగ్రెస్(ఎం) సీనియర్ నేత కేఎం మణి కుమారుడు జోస్ కే మణికి, ఎమ్మెల్యే జోసెఫ్‌కు మధ్య పవర్ స్ట్రగుల్ నడిచింది. పాలా బైపోల్‌కు టికెట్ ఇవ్వడంపై వీరిద్దరికి చెడింది. జోస్ నామినీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఈ ముసలం మరింత ముదిరింది. జోసెఫ్‌కు రాష్ట్ర కాంగ్రెస్ అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే జోస్ కే మణి, తన వర్గం ఎల్‌డీఎఫ్‌లోకి చేరనున్నట్టు ప్రకటించారు.

అయితే, ఇంకా ఎల్‌డీఎఫ్‌తో సంప్రదింపులు జరపలేదని వివరించారు. కేఎం మణిని కాంగ్రెస్ అగౌరవపరిచిందని, ఆయన సారథ్యంపై కుట్రలు చేసిందని జోస్ ఆరోపించారు. కాంగ్రెస్(ఎం)ను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని పేర్కొన్నారు. కాగా, జోసెఫ్ వర్గం యూడీఎఫ్‌లోనే కొనసాగనున్నట్టు తెలుస్తున్నది. కాగా, కాంగ్రెస్(ఎం)ను అక్కునచేర్చుకోవడానికి సీపీఎం కొన్నాళ్లుగా తహతహలాడుతుండటం గమనార్హం.