వలస జీవుల ప్రయాణ చార్జీలను మేం చెల్లిస్తాం : సోనియా గాంధీ

by  |
వలస జీవుల ప్రయాణ చార్జీలను మేం చెల్లిస్తాం : సోనియా గాంధీ
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంతూరికి చేరేందుకు కావాల్సిన ట్రైన్ చార్జీలను కాంగ్రెస్ చెల్లిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ప్రతిరాష్ట్రంలోని తమ పార్టీ యూనిట్ వలస కార్మికుల ప్రయాణ చార్జీలను చెల్లిస్తుందని ప్రకటించింది. స్వతంత్ర భారతంలో పౌరులు పొట్టచేతపట్టుకుని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ సొంతింటికి వెళ్లే పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదని, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణివల్ల నేడు వలస జీవులు కాలి నడకన ఇంటికెళ్లే పరిస్థితులు దాపురించాయని సోనియా గాంధీ విమర్శించారు. విదేశాల్లో చిక్కుకున్న పౌరులకు ప్రత్యేకంగా ఉచిత విమానాలను కేంద్రం.. ఏర్పాటు చేసిందని,అంతెందుకు గుజరాత్‌లో ఒక కార్యక్రమం(ట్రంప్ పర్యటన) కోసం సుమారు వంద కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రైల్వే మినిస్ట్రీ రూ. 151 కోట్ల నిధిని పీఎం కేర్స్‌కు అందించింది కానీ, ఈ దేశంలోని మట్టి మనుషులు సర్కారుకు కంటికి ఎందుకు కనపడటం లేదని ఆరోపించారు. ఇవన్ని దృష్టికి తెచ్చుకోవాలని చెబుతూ.. వలస కార్మికులకు ఉచిత ట్రైన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. లేదా వారి ప్రయాణ చార్జీలను కాంగ్రెస్ భరిస్తుందని వివరించారు. బీహార్‌లోని ప్రతిపక్షమూ వలస కార్మికుల 50 శాతం ప్రయాణ ఖర్చులను చెల్లిస్తామని ప్రకటించింది.

‘కాంగ్రెస్ షో చేస్తున్నది’

ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వవర్గాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఊరికే షో చేస్తున్నదని ఆరోపించాయి. వలస కార్మికుల ట్రైన్ టిక్కెట్‌లలో 85శాతం కేంద్రమే భరిస్తున్నదని, 15 శాతం ఆయా రాష్ట్రాలు చెల్లించాల్సి ఉన్నదని తెలిపాయి. అదీగాక, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా దాదాపు సగం ట్రైన్ ఖర్చును ఊరికే భరిస్తున్నదని వివరించాయి. లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ట్రైన్‌లను కేంద్రం శుక్రవారం నుంచి ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రైల్వే మినిస్ట్రీ ప్రకటన మరోలా ఉన్నది. స్థానిక ప్రభుత్వ అధికారులే సాంక్షన్ చేసిన టికెట్‌లను వలస జీవులకు అందించి.. టికెట్ చార్జీని వసూలు చేసి తమకు అప్పగించాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ ఓ సర్క్యూలర్‌లో పేర్కొనడం గమనార్హం.

Tags: railway ministry, fare, subsidizing, pay, special trains, migrant workers


Next Story