రేవంత్​కు పీఠం… ఉత్తమ్​కు ప్రతిష్టాత్మకం!!

by  |
రేవంత్​కు పీఠం… ఉత్తమ్​కు ప్రతిష్టాత్మకం!!
X

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరు రాజకీయ పార్టీల్లో ఎలా ఉన్నా… కాంగ్రెస్‌లో​ మాత్రం నేతల ఫైట్​గా మారింది. కాంగ్రెస్​కే మండలి ఫైట్​ అన్నట్టుగా తయారైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు హస్తానికి ఆధిపత్య పోరుగా తయారైంది. తెలంగాణ కాంగ్రెస్​ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​… పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎంపీ రేవంత్​రెడ్డి మధ్య వర్గ విభేదాలు మొన్నటి పాదయాత్రతోనే పూర్తిగా బయటపడ్డాయి. ఉత్తమ్​తో పాటు కొంతమంది సీనియర్లు మాత్రమే ఈ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. చాలా మంది నేతలు పాదయాత్రలో పాల్గొని… రాజీవ్​ రైత భరోసా రణభేరి సభను విజయవంతం చేశారు. అక్కడ కూడా పార్టీలోని సీనియర్లపై సభా వేదిక నుంచే కొంతమంది విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రమంతా పాదయాత్రకు ప్లాన్​ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న మండలి ఎన్నికలు మాత్రం రేవంత్ వర్సెస్ ఉత్తమ్ ఫైట్​గా సాగుతున్నాయి. రెండు పట్టభద్రుల ఎన్నికల నియోజకవర్గాలను చెరొకటి భుజాలపై వేసుకున్నారు.

రేవంత్​కు పీఠం… ఉత్తమ్​కు ప్రతిష్టాత్మకం

టీపీసీసీ పీఠం కోసం జరుగుతున్న నాటకీయ పరిణామాలన్నీ తెలిసిందే. ఎక్కడా లేని గందరగోళానికి దారి తీసింది. పూటకో పేరు బయటకు వచ్చింది. చాలా మంది నేతలు రేవంత్​కు సపోర్టు చేసినా సీనియర్లు మాత్రం వ్యతిరేకించారు. చివరకు జీవన్​రెడ్డి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది కూడా ఫైనల్​ కాకముందే జానారెడ్డి కోరికతో సాగర్​ ఉప ఎన్నిక తర్వాత వరకు వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ తనకు అనుకూల అవకాశాలను కల్పించుకోవాలని ఎంపీ రేవంత్​రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడబెట్టుకుంటున్నాడని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చిన మండలి ఎన్నికల్లో కూడా సత్తా చూపించుకోవాలని పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే రేవంత్​రెడ్డి హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ పట్టభద్రల నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. వరుస సమావేశాలతో ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నేతలు కలిసి రాకున్నా… వచ్చిన నేతలతో మండలి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ విజయం సాధించుకుని టీపీసీసీ చీఫ్​ పీఠం కోసం తొలి ప్రాధాన్యతలో ఉండాలని రేవంత్​ ప్రయత్నం. మరోవైపు ఎంపీ ఉత్తమ్​పై పార్టీ ఓటమి ప్రభావం తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి జీహెచ్​ఎంసీ ఎన్నికల వరకూ కాంగ్రెస్​ పార్టీ వరుస పరాజయాలను మూటగట్టుకుంది. కాంగ్రెస్​ అట్టర్​ ప్లాప్​ అయింది. కారణం ఉత్తమ్ అంటూ నేతలు అధిష్టానానికి సైతం విన్నవించుకున్నారు. కానీ ఉత్తమ్​ను ఆ స్థానం నుంచి పక్కకు తీయడం లేదు. ఒక దశలో నాకే ఈ పదవి వద్దూ అంటూ ఉత్తమ్​ రాజీనామా లేఖలను సమర్పించారు. కానీ టీపీసీసీ ఉత్తమ్​ను విడిచి పోవడం లేదు. అయితే ఇప్పుడు వరంగల్​– ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించుకుని ఓటమి మచ్చను తొలగించుకోవాలని ఉత్తమ్​ ప్రయత్నం.

సీనియర్లు ఒకవైపు..

ఇక కాంగ్రెస్​ పార్టీని ఒక్కతాటిపైకి తీసుకురావడమనేది సాధ్యం కాని అంశమని పలుమార్లు తేటతెల్లమైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, వర్గాలుగా విడిపోయి దాడులకు దిగడం వంటివన్నీ పార్టీ నేతల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మండలి ఎన్నికల్లో మాత్రం సీనియర్లంతా ఒకవైపే ఉన్నట్లుగా ఉన్నారు. వరంగల్​ పట్టభద్రుల స్థానానికి ఉత్తమ్​ బాధ్యతలు తీసుకోగా… సీనియర్లు జానారెడ్డి, భట్టీ, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, వీ హనుమంతరావు వంటి నేతలంతా ఈ సెగ్మెంట్​పైనే కన్నేశారు. ఈ జిల్లాలతోనే సంబంధాలు అనే సాకుతో ఇటువైపే ఉంటున్నారు. హైదరాబాద్​ సెగ్మెంట్​ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎంపీ రేవంత్​ ప్రచార బాధ్యతలు తీసుకున్న హైదరాబాద్​ స్థానంలో మాత్రం రేవంత్​రెడ్డితో పాటు పార్టీలో కలిసినప్పుడు తన వెంట నడిచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, అభ్యర్థి చిన్నారెడ్డి వంటి నేతలతో ప్రచారం చేసుకుంటున్నారు. అంతే మినహా… సీనియర్లు రెండు నియోజకవర్గాల్లో తిరగడం లేదు.


Next Story