క్యాంప్ నుంచి వచ్చేది ఆ రాత్రే.. కాంగ్రెస్ గాలానికి చిక్కేదెవరు..?

by  |

దిశ ప్రతినిధి, మెదక్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ నెల 10 న జరిగే పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా పార్టీ అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ అభ్యర్థులు గత రెండు రోజులుగా బహిర్గతంగా కన్పించనప్పటికీ అంతర్గతంగా ఓటర్లతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అధికార టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై ఆధారపడగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తి నేతలపై ఆధారపడింది. ఎన్నికకు ఒక్క రోజే మిగిలి ఉండటంతో రెండు పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ రావు మళ్లీ ట్రబుల్‌గా మారుతాడా లేక ఈ ఎన్నికల్లో నెగ్గుతాడా అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

సంతృప్తి చెందని టీఆర్ఎస్ ఎంపీటీసీలు

అధికార పార్టీ గెలుపు బలం మెండుగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రభుత్వంపై అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఎంపీటీసీలకు సముచిత గౌరవం లేదని, కనీసం నిధులు కేటాయించడం లేదని పలుమార్లు ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు తమ నిరసన తెలిపేందుకు ఎన్నికల బరిలో నిలిచారు కూడా. అయితే బరిలో నిలిచిన వారిని శాంతింపజేసి నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంలోనైతే సక్సెస్ అయ్యారు. అయినా వారు సంతృప్తి చెందనట్టే తెలుస్తోంది. అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ క్యాంపులకు తీసుకెళ్లింది. అయినా క్యాంపులతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సంతృప్తి చెందట్లేదని, తమ గ్రామాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలాగే అసంతృప్తిలో ఉంటే మాత్రం టీఆర్ఎస్‌కు గడ్డుకాలం తప్పదు.

క్యాంపులపైనే అధికార పార్టీ ధీమా..

అసంతృప్తిలో ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, పట్టణ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను తమ కుటుంబ సభ్యులతో క్యాంపునకు తరలించడం తమకు కలిసివస్తోందని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. క్యాంపులో వారికి కావాల్సిన సకల సదుపాయాలు కల్పించామని, ప్రజాప్రతినిధి హోదాలో ఇంతలా ఎవరూ ఎంజాయ్ చేయడం లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారందరు సరదాగా గడుపుతున్నారని ఇది టీఆర్ఎస్‌కు వంద శాతం కలిసి వస్తోందని కొందరు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా క్యాంపుల్లో ఉన్న వారందరిని ఈ నెల 9న రాత్రి జిల్లా శివారుల్లోకి వచ్చేలా టీఆర్ఎస్ ప్లానింగ్ చేసినట్టు సమాచారం. 9న రాత్రి మరోమారు మాక్ పోలింగ్ నిర్వహించి పదో తేదీన నేరుగా ఓటేసి ఎవరి ఇండ్లకు వారు చేరుకునేలా టీఆర్ఎస్ పక్కా వ్యూహం రచించినట్టు తెలుస్తోంది.

మరో పరీక్షకు సిద్ధమైన హరీశ్ రావు

టీఆర్ఎస్ పార్టీకి ఏ ఆపద వచ్చిన మొదట గుర్తుకొచ్చే నాయకుడు హరీశ్ రావు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా అధిష్టానం మంత్రి హరీశ్ రావుకే బాధ్యతలు అప్పగించింది. మొదటి ప్రభుత్వ హయంలో అన్ని స్థానాలను గెలిపించుకొని పార్టీకి రిలీఫ్ నిచ్చిన ఆయన రెండో సారి కాస్త ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదలైన హరీశ్ పతనం హుజురాబాద్ వరకు కొనసాగింది. అయినా అధిష్టానం మాత్రం మళ్లీ మెదక్ గెలుపు బాధ్యతను హరీశ్ రావుకే అప్పగించింది. టీఆర్ఎస్‌కు చెందిన అందరు ప్రజాప్రతినిధులు హరీశ్ రావు మాట వింటారా లేక ప్రభుత్వ తీరు నచ్చక పక్క పార్టీకి ఓటేసి మళ్లీ హరీశ్ రావును ఓటమిపాలు చేస్తారా అన్నది జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏదేమైనా జిల్లా మంత్రి హరీశ్ రావు అగ్గి పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమైనా… పరీక్ష పాసైతాడా లేదా అన్నది ఈ నెల 14 న తేలనుంది.

క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ ఆశలు

టీఆర్ఎస్‌కు మొదటి నుండి గట్టి పోటీనిస్తూ.. టీఆర్ఎస్ అసంతృప్తి నేతలను ఆకట్టుకునేందుకు ఆది నుంచి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే భారీ నజరానాలు అందిస్తామని సైతం బహిరంగంగా ప్రకటించారు. దీనికితోడు టీఆర్ఎస్ పార్టీ జెండాపై గెలిచిన ప్రజాప్రతినిధులు అసంతృప్తిలో ఉన్నారని, వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటూ కాంగ్రెస్ వారిపై గంపెడాశలు పెట్టుకుంది. టీఆర్ఎస్ అసమ్మతి నేతల ఓట్లు, కాంగ్రెస్ ఓట్లు కలిపి గెలుపు అంచులకు చేరుతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ నెల 10 న జరిగే పోలింగ్ సరళి, 14న పోలింగ్ ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story