దుబ్బాక ‘హస్త’గతమయ్యేనా?

by  |
దుబ్బాక ‘హస్త’గతమయ్యేనా?
X

దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో ప్రధాన పార్టీలన్నింటికీ దుబ్బాక ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది. ఇక్కడి ప్రభావమే రానున్న ఎన్నికల్లో చూపనుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితిలోనూ దుబ్బాకను ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వమంతా నియోజకవర్గంలోనే తిష్టవేసి దుబ్బాక ‘చేయి’ జారిపోకుండా ఉండేందుకు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామానికో ఇన్‌చార్జిని నియమించి, ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతూ, పలు సూచనలు, సలహాలిస్తూ పక్కా ప్లాన్‌ను అమలు చేసేలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక పోరు ఆయా పార్టీల ప్రచారాలు, ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. అధికార టీఆర్ఎస్‌కు దీటుగా కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగిస్తోంది. తమకి వారసత్వంగా వస్తున్న పట్టును మరోసారి నిరూపించుకొని తిరిగి ఫామ్‌లోకి రావాలని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నది. ఇందుకు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ, ఆయన బాటలోనే తన తనయుడు వస్తున్నాడని, ఆయనకు ఒక్క అవకాశమిచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే తమ పార్టీని సునాయసంగా గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర నాయకత్వమంతా ఇక్కడే..

దుబ్బాక ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, గెలుపుకోసం అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, శ్రీదర్ బాబు, వీ.హనుమంతరావు, షబ్బీర్ ఆలీ, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ లాంటి నేతలంతా రంగంలోకి దిగి తమకు అప్పగించిన మండలాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గ పరిధిలోని ఒక్కో మండలానికి ఐదుగురు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించడంతో పాటు మొత్తం 149 గ్రామాలకు ఒక్కో ఇన్‌చార్జిని నియమించి గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్నికల నామినేషన్ సందర్భంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి దీటుగా, హరీశ్ రావును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన ప్రసంగం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.

ఆశలన్నీ ముత్యంరెడ్డి అభివృద్ధిపైనే..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి తండ్రి చెరుకు ముత్యంరెడ్డి పలుమార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కాలంలోనే దుబ్బాక అభివృద్ధి జరిగిందని, అప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను పల్లెలకు తెచ్చిన ఘనత చెరుకు ముత్యంరెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. దుబ్బాకను మండల కేంద్రంగా, దుబ్బాకలో ఐదు మార్కెట్ కమిటీలు, ఐదు టీటీడీ కల్యాణ మండపాలు ఏర్పాటు చేయించారని, కూడవెళ్లి వాగుపై చెక్ డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషి చేశారని ప్రచారంలో ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ముత్యం రెడ్డి మృతి చెందడం, ఆయన వారసుడిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో దిగడంతో సానుభూతి కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఠాగూర్ ప్లాన్ ఫలించేనా..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న కుంతియా స్థానంలో ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మాణిక్కం ఠాగూర్‌కు దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన మార్కు చూపాలని మొదటి నుంచి దుబ్బాకపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికలో కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు. ఇక్కడి గెలుపు ప్రభావమే రానున్న ఎన్నికలపై ఉంటుందని, ఉప ఎన్నిక ముగిసేదాకా రాష్ట్ర నాయకులంతా దుబ్బాకలోనే ఉండాలని ఆదేశించారు.



Next Story