మరింత భయపెడుతోంది: వీహెచ్

by  |
మరింత భయపెడుతోంది: వీహెచ్
X

“కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత పడే తిప్పలకంటే అది రాకుంట చూసుకోవడమే తెలివైన పని. నా స్వీయానుభవం నాకు ఇదే నేర్పింది. వైరస్ సోకిందని రిపోర్టు రాగానే దవాఖానకు పోవాలని డిసైడ్ అయిన. పైన దేవుడున్నడు. ఇక్కడ డాక్టర్లు ఉన్నరు. ఏం జరుగుతదో జరగనీ అని అనుకున్న. నా గుండె ధైర్యమే నన్ను బతికించింది. కరోనాకు మందు లేదని నాకు తెలుసు. అందుకే విల్ పవర్‌ను మించిన మందు లేదు అనుకున్న. గుండె గట్టిగ చేసుకున్న. పది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న” కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్న మాటలివి. ‘దిశ’తో ఆయన తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో: వైరస్ వచ్చిందని తెలియగానే ఆందోళన పడ్డరా?

అస్సలు భయపడలే. ఆందోళన అంతకంటే లేదు. కానీ, పాజిటివ్ వచ్చిందా? అని ఆలోచనలపడ్డ. ఇగ దవాఖానకు పోక తప్పదనుకున్నపుడు ఏదో అయిపోతదని అనుకోలే. పైన దేవుడున్నడు. ఈడ డాక్టర్లు ఉన్నరు. అంతా వారికి వదిలేసిన. ఏం చేసుకుంటరో చేసుకోని అనుకుని ధైర్యంగ ఉన్న. బైటపడ్డా. నౌ ఐయామ్ ఆల్ రైట్.

టెస్టుకంటే ముందే ఏమైనా అనుమానం ఉండెనా?
జూన్ 20న రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. వారం రోజుల ముందు కొంత అనుమానముండె. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం జూన్ 13న దుమ్ముగూడెం ప్రాజెక్టు చూసి నిరసన తెలిపే కార్యక్రమం పెట్టుకున్న. జూన్ 12 రాత్రే కొత్తగూడెం చేరుకున్న. ఆ రాత్రికే పోలీసులు అరెస్టు చేసిండ్రు. వర్షం పడుతున్నా గంట సేపు ధర్నా చేసిన. పోలీసు స్టేషన్‌కు పోంగనే తేడా కొట్టింది. కానీ, వైరసేమో అనే అనుమానం రాలే. 16న నా బర్త్ డే. పేదోళ్లకు చేతనైన సాయం చేసిన. అప్పుడు కూడా బాగనే ఉంది. మల్ల 19న రాహుల్ గాంధీ బర్త్ డే. దుప్పట్లు పంచిపెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్న. పగటీలి దాకా బాగనే ఉండె. సాయంత్రానికి చలి మొదలైంది. అప్పుడు వైరస్ అయ్యుండొచ్చు అనే అనుమానమొచ్చింది. టెస్టు చేయించుకోవడం బెటర్ అని మా అల్లుడు చెప్పిండు. 21న టెస్టు చేయించుకున్న. పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. వెంటనే అపోలో ఆసుపత్రికి పోయిన. బహుశా దుమ్ముగూడెం కార్యక్రమం రోజునే వైరస్ మొదలైందేమో అని ఇప్పుడనిపిస్తోంది.

ఆసుపత్రికి వెళ్లే ముందు ఏమైనా భయపడ్డరా?
భయపడి ఏం జెయ్యాలె? ఈ జబ్బుకు మందే లేకపాయె. ఏదన్నా చేయాల్సి వస్తే డాక్టర్లు చేయాలి. అందుకే ధైర్యంగా ఉన్న. ఆసుపత్రిలో చేరినంక ధైర్యం కొంత పెరిగింది. డాక్టర్ల చేతిలో పడ్డ కాబట్టి అంతా వారే చూసుకుంటరు అని ధైర్యం చెప్పుకున్న. భగవంతుడే నాకు ఆ శక్తిని ఇచ్చిండు.

ఆసుపత్రిలో చేరినంక కూడా చాలా మంది సచ్చిపోతుండ్రు గదా!
దేనికైనా విల్ పవర్ ఉండాల్రా భయ్. నాకు అది మస్తుగా ఉంది. ఇగ దేవుడున్నడనే ధైర్యం ఎట్లాగూ ఉంది. పేదోళ్లకు సాయం చేస్తే మనకు ఆపదొచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటడని నాకు తెలుసు. నేను నమ్మిన ఆంజనేయస్వామి నన్ను బతికిస్తడనుకున్న. ఎందుకంటే నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలే. మనం ఏం చేసినా పైన దేవుడు చూస్తూనే ఉంటడు. డాక్టర్లకు, నర్సులకు పూర్తిగా సహకరించిన. వాళ్లు ఇంజెక్షన్లే గుచ్చుకుంటరో, రక్తమే తీసుకుంటరో పట్టించుకోలె. మొత్తానికి బైటపడ్డ. అసలు డాక్టర్లు, నర్సులే నా ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిండ్రు.

షుగర్ జబ్బు ఏం చేస్తదో అని భయపడలేదా?
నాకు షుగర్ ఉన్నది వాస్తవమేగానీ బీపీ, ఆస్తమా లాంటివి లేవు. చిన్నప్పటి నుంచీ రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్త. ఢిల్లీల గూడ కాన్‌‌స్టిట్యూషన్ క్లబ్‌ల జిమ్‌కు పోయెటోడ్ని. గతంల ఇల్లంతకుంట, శ్రీశైలం ఎడమకాల్వ, పుట్టంగట్టు, నార్కట్‌పల్లి లాంటి పాదయాత్రలు చేసిన. ఎప్పుడూ స్పీడ్‌గా నడుస్తుంట. అది ఇప్పుడు బాగా ఉపయోగపడ్డది. ఎనర్జీ ఉంది. 72 ఏళ్ళయినా నా ధైర్యం అదే.

ఆసుపత్రిలో పది రోజులు ఎట్ల గడిచింది?
భయపడితే సగం సచ్చిపోతమని నాకు తెలుసు. అందుకే నేను ధైర్యంగ ఉన్న. సచ్చేదాక పేదలకు చేతనైన సాయం చేయాలనేదే నా పాలసీ. ఎప్పుడు బైటపడతనా? మల్ల జనాలల్లకి ఎప్పుడు పోతనా అని అనుకునేది. ఎందుకంటే, ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండాలనుకుంట. మంచి చెడ్డ అంత డాక్టర్లే సూసుకుంటున్నరు కాబట్టి వాళ్లు ఎప్పుడు పంపితే అప్పుడే పోదామని డిసైడైన. అట్ల పది రోజులు గడిచిపోయినయ్. ఇప్పుడు ఇంట్ల కూర్చున్న. కానీ, ఖాళీగ లేను. స్టేట్‌మెంట్లు ఇస్తున్న. ఒక పని పెట్టుకుంటే ఎనర్జీ ఆటోమేటిక్‌గ వస్తది. ఆలోచనలు వస్తాయి. దాంతో పది మంది దీవెనలు ఉంటయి. ఖాళీగ ఉండొద్దు.

ఆసుపత్రిలో చికిత్స ఎలా జరిగింది?
దవాఖానలో ఉన్న పది రోజులూ డాక్టర్లు సూచించిన ఆహారాన్ని తీసుకున్న. పండ్లు, డ్రై ఫ్రూట్స్, విటమిన్-సి ఎక్కువగా ఉండే పదార్ధాలు, ఇమ్యూనిటీ పెంచేవి.. ఇలా వారు కొన్ని చెప్పారు. నీళ్లు మాత్రం ఎప్పుడూ వేడిగా ఉండేవే తాగాను. పొద్దున లేవగానే ఉప్పు నీళ్లు పుక్కిలించడం లాంటివి కూడా.

సర్కారు ఆస్పత్రికి ఎందుకు పోలె?
సర్కారు దవాఖాన ట్రీట్‌మెంట్ గురించి మనకు తెల్వదారా భయ్. నాకే కాదు ప్రజలకే నమ్మకం లేదు. ఏ పేదోడ్ని అడిగినా సర్కారు ఆసుపత్రి గురించి చెప్తరు. అందుకే అప్పులైనా పర్లేదుగానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలనుకుంటున్నరు. కారణం సర్కారు ఆసుపత్రుల్లో నిర్లక్ష్యమే. ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌ని సీరియస్‌గ తీసుకుంటలేదు. ఆక్సిజన్ లేదు. వెంటిలేటర్లు లేవు. స్టాఫ్ లేరు. సౌకర్యాలు అసలే లేవు. కేసీఆర్ డ్యామ్‌ల మీద బడ్డడు. ఇగ ఆయన కొడుకు కేటీఆర్ ఐటీ, పరిశ్రమలనుకుంట స్టేట్‌‌మెంట్లు ఇస్తుండు. ఇద్దరూ పట్టించుకుంటలేరు. ఇగ ఎవరికైనా సర్కారు దవాఖాన్ల మీద ధైర్యం ఎట్లొస్తది?

పాజిటివ్ అని తేలినంక ఎవరైనా ఏం చేయాలి?
పాజిటివ్ వచ్చినవారు గట్టిగా, ధైర్యంగా ఉండాలి. కరోనా నన్ను ఏమీ చేయలేదు అనుకోవాలి. డాక్టర్ల సలహా పాటించాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి తప్ప ఎవ్వరూ కాపాడరు. గతంలో మందులున్నయ్, డాక్టర్లున్నరు అనుకునేటోళ్ళం. కాపాడతారనుకునే ధైర్యం ఉండేది. కానీ ఈ రోగానికి సరైన మందు లేదు. కాబట్టి ఎవరికి వారే గుండె గట్టిగ చేసుకుని ధైర్యంగ ఉండాలె.

జాగ్రత్తలు పాటించనందుకే కరోనా వచ్చిందా?
ఎట్లొచ్చిందో నాకే తెల్వదు. కానీ, రాకుండ ఉండాలంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. నా అనుభవం నుంచి చెప్తున్న. దవాఖాన్ల చేరినంక ఈ వైరస్ గురించి డాక్టర్లు చాలా చెప్పిండ్రు. అందుకే ప్రతీ ఒక్కరు వైరస్ రాకుండ చూసుకోవడం బెటర్. అందుకోసం ప్రభుత్వ గైడ్‌లైన్స్ పాటించాలె. సేఫ్‌గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలె. మాస్కు పెట్టుకోవాలె. బైటకు వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలె.

అయినా వైరస్ వస్తే ?
తినే తిండిలో ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒంట్లో ఇమ్యూనిటీ పెంచుకోవాలె. మందే లేదు కాబట్టి డాక్టర్లు ఏం చెప్తే అది చేయాలె. అన్నింటికంటే మంచి విటమిన్ ఏందంటే ధైర్యంగా ఉండడమే. అందుకే విల్ పవర్ ప్రతీ ఒక్కరూ పెంచుకోవాలె. ఉన్నంతలో వేడినీళ్ళు తాగితే మంచిదంట. నేను అదే చేస్తున్న.

జనం ఇప్పుడేం చేయాలె?
పాయింటేంటంటే… ఈ వ్యాధి మనకు తెలియని డిసీజ్. అది వచ్చేదాక ఎవ్వరికీ అర్థంకాదు. మొదట్ల దగ్గు, జలుబు ఉంటాయన్నరు. కానీ ఇప్పుడు అవేవీ వస్తలేవు. కనిపెట్టడం కష్టం. టెస్టులో వస్తే వచ్చినట్లు. లేకుంటే అందరూ నాకు లేదనే అనుకుంటరు. డాక్టర్లకే వస్తుంటే ఇగ మనమెంతరా భయ్? వ్యాక్సిన్ కనుక్కునే వరకు మందు లేదు, ఒక డైరెక్షనూ లేదు. ఎవరికి వారు సేఫ్‌గా ఉంటే మంచిది. వైరస్ వచ్చిందని తెలవంగనే కొంతమంది మీదికెళ్లి దూకి సూసైడ్ చేసుకుంటున్నరు. హుస్సేన్ సాగర్‌ల దూకుతున్నరు. ఇంకొంతమంది ఫ్యామిలినీ పరేషాన్ చేయొద్దనుకుంట ఎక్కువ ఆలోచించి గుండాగి సచ్చిపోతుండ్రు. అందుకే ఈ జబ్బు నయం కావడంలో విల్ పవర్‌ మేజర్ రోల్ ప్లే చేస్తది. ధైర్యంగుండాలె. గట్టిగుండాలె.

టెస్టులకు తిప్పలు పడాల్సి వస్తుంది గదా!
మొదటి నుంచే టెస్టులు బాగా జరిగి ఉంటే ఇప్పుడీ పంచాయతీ ఉండేది కాదు. మొదట్లో టెస్టులు ఎక్కువ చేయలేదు. తెలంగాణకు చెడ్డ పేరు వస్తుందనుకుంది ప్రభుత్వం. కరోనా వచ్చినోళ్ళందరినీ గాంధీ ఆసుపత్రికి పరిమితం చేసిండ్రు. వలస కార్మికులకు మొదట్లోనే క్యాంపులు పెట్టి ఉంటే ఇప్పుడింతగా వ్యాప్తి చెందేది కాదు. అప్పుడు నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఎంత పెరగాలో అంత పెరిగింది. ఇప్పుడు ఉరుకులాడాల్సి వచ్చె.

ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఉందనుకుంటున్నారు?
జనాలు కరోనాతో భయపడుతున్నరు. ప్రభుత్వం మాత్రం దాని పని అది చేసుకుంట పోతా ఉంది. జనాల కరోనా కష్టాలకంటే సీఎం సచివాలయానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నడు. కేసీఆర్ తనకు ఒక హిస్టరీ ఉండాలనుకుంటున్నడు. గతంలో షాజహాన్ తాజ్ మహల్ తరహాలో ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక రాజు లాగా సచివాలయాన్ని కట్టాలనుకుంటున్నడు. చరిత్ర కోసం పాకులాడుతున్నడు. ఆయన బలమంతా మా లాంటి ప్రతిపక్షం బలహీనంగా ఉండడమే. మా పార్టీ నాయకులు గాంధీ భవన్ నుంచి స్టేట్‌మెంట్లు ఇస్తుంటరు. ధర్నా అని రోడ్డుమీదకు రాంగనే అరెస్టవుతున్నరు. అంతకు మించి ఏమీ జరుగుతలేదు. ఇగ బీజేపోళ్లంటరా… స్టేట్‌మెంట్లకే పరిమితం. కార్యాచరణ లేదు. కిషన్ రెడ్డి మాటల్ని చూస్తే అర్థమైతలేదా? కరోనా టైమ్‌లో ప్రజలకు ఏ పార్టీ కూడా భరోసా ఇస్తలేదు.


Next Story

Most Viewed