‘గువ్వల బాలరాజు వలస కూలీ బిడ్డను అని చెప్పి గెలిచిండు’

by  |
Congress leader Vamsi Krishna
X

దిశ, అచ్చంపేట: ‘‘అయ్యా ముఖ్యమంత్రి గారు. హుజురాబాద్‌ తరహాలో అచ్చంపేట నియోజకవర్గానికి కూడా వేలకోట్లు మంజూరు చేసి, అభివృద్ధి చేయాలి.’’ అని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం అచ్చంపేట పట్టణం నుంచి రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో ‘దళితబంధు’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది అచ్చంపేట నియోజకవర్గమే అని, ఈ ప్రాంతంలో సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి లేక కేవలం వర్షాలపై ఆధారపడి పంటలు పండించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అలాగే ఎస్సీ నియోజకవర్గమైన అచ్చంపేట ప్రాంతంలో ‘దళితబంధు’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే మరణించైనా ఉండాలి లేదా రాజీనామా చేసి ఉపఎన్నికలైనా సృష్టించాలని అన్నారు. వలస కూలీ బిడ్డను అని చెప్పిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయన ఒక్కడే బాగు పడ్డాడని, నేడు బెంజ్ కారులో తిరుగుతూ సౌకర్యవంతమైన జీవనం కొనసాగిస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే తానా అంటే అనుచరులు తందానా అంటున్నారని విమర్శించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story