ఐక్యత లేదు.. క్యాడ‌ర్ లేదు.. లీడ‌రే లేడు..

131

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అస్థవ్యస్థమైన ఫ‌లితాల‌ను మూట‌గ‌ట్టుకుంది. అధికార పార్టీకి క‌నీస పోటీని కూడా ఇవ్వలేక‌పోయింది. మెజార్టీ డివిజ‌న్‌లలో పార్టీ అభ్యర్థులు మూడోస్థానంలో నిల‌వ‌గా.. కొన్ని డివిజ‌న్‌లలో అయితే ఏకంగా నాలుగో స్థానంలో ఉండిపోయారు. మొత్తంగా పోలైన ఓట్లశాతం కూడా గ‌త ఎన్నిక‌ల క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌న్నీ ఒక‌ప్పుడు కాంగ్రెస్ కంచుకోట‌గా వ‌ర్ధిల్లిన వ‌రంగ‌ల్‌లో పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయి. కార్పోరేష‌న్ ఫ‌లితాల అనంత‌రం దిగువ‌స్థాయి నేత‌లు త‌మ దారి తాము చూసుకునేందుకు యోచిస్తున్నారు. ఇప్పటికే నామ‌మాత్రంగా ఉన్న కేడ‌ర్.. కార్పోరేష‌న్ ఫ‌లితాల‌ను ఏమాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. పార్టీలోనే ఉంటే త‌మ‌కు ఎలాంటి రాజ‌కీయ భ‌విష్యత్తు ఉండ‌ద‌న్న భ‌యం పార్టీ శ్రేణుల్లో క‌నిపిస్తుంది.

పోలింగ్ మేనేజ్‌మెంటులో ఫెయిల్‌…

ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందు నుంచే డివిజ‌న్‌లలో క‌మిటీలు వేశాం, అభ్యర్థుల జాబితా.. ఆశావ‌హుల జాబితా అంటూ జిల్లా కాంగ్రెస్ నాయ‌క‌త్వం క‌బుర్లు చెప్పింది గాని… బీ ఫారం అంద‌జేత‌ గ‌డువు ముందు మ‌రో గంట‌లో ముగుస్తుంద‌న్న స‌మ‌యానికి కూడా టికెట్ల విష‌యం తేల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌సేపు అధికార పార్టీలోని అసంతృప్తుల‌ను పార్టీలోకి మ‌ళ్లించుకోవ‌డం… పార్టీలోని అసంతృప్తుల‌ను ప‌క్క పార్టీలోకి వెళ్లకుండ చూసుకోవ‌డం అనే అంశంపై ఎక్కువ‌గా పార్టీ పెద్దలు ఫోక‌స్ పెట్టారు. ప్రచారం, పోలింగ్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా అభ్యర్థుల‌పై వేయ‌డం, పార్టీ ప‌రంగా క‌నీసం సాయం ద‌క్కక‌పోవడ‌మే కొంత‌మంది అభ్యర్థుల ఓట‌మికి కార‌ణమ‌ని ఆ పార్టీకి చెందిన నేత‌లే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు ఓట‌ర్లను పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. ఈ విష‌యంలో అధికార పార్టీ అభ్యర్థుల‌తో బీజేపీ పోటీ ప‌డ‌టంతోనే ట‌ఫ్ ఫైట్ నెల‌కొన్న డివిజ‌న్‌లలో గెలుపును త‌మ వైపున‌కు తిప్పుకోగ‌లిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఈ విష‌యంలో అట్టర్ ప్లాప్ అయింద‌ని చెబుతున్నారు.

తూర్పులో హ‌స్తం.. అస్తమ‌యం…

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 24 డివిజ‌న్లు ఉండ‌గా 23 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. వ‌రంగ‌ల్ తూర్పు బాధ్యత‌ల‌ను మాజీ ఎమ్మెల్సీ కొండాముర‌ళీ, మాజీ మంత్రి కొండా సురేఖ దంప‌తులు తీసుకోవ‌డం, అభ్యర్థుల వ్యయాన్ని కూడా తామే భ‌రిస్తామ‌ని బాహాటంగా ప్రక‌టించ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అంచ‌నాలు పెరిగాయి. ఫ‌లితాలు మాత్రం కొండా దంప‌తుల‌కు మింగుడుప‌డ‌ని రీతిలో రావ‌డం గ‌మ‌నార్హం. ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలిపించుకోలేక‌పోయార‌నే అప్రతిష్ఠను వారు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. కొండా దంప‌తుల బ‌ల‌మేంటో తేలిపోయిందన్న విమ‌ర్శలు పార్టీ నేత‌ల మ‌ధ్య వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా మూడంటే మూడే డివిజ‌న్‌లతో స‌రిపెట్టుకోవాల్సి రావ‌డం బాధాక‌ర‌మ‌ని ద్వితీయ శ్రేణి నేత‌లు వాపోతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..