సాగర్‌లో ఇజ్జత్‌ క సవాల్!

by  |
సాగర్‌లో ఇజ్జత్‌ క సవాల్!
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్స్‌తో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్‌ను మరో బైపోల్ రసవత్తరంగా మార్చనుంది. వారం క్రితం నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం కాగా, ఒక్కసారిగా పొలిటికల్ పార్టీల చూపంతా అటు వైపు మళ్లింది. ఎలాగైనా సాగర్‌ను కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతూ, స్థానిక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి. అయితే ఈసారి చావో రేవో తేలాలన్న రేంజ్‌లో ప్రధాన పార్టీలు పోటీపడుతుండగా, ప్రజలు ఏపార్టీకి విజయం అందిస్తారన్నది చర్చనీయాంగా మారింది.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో సూపర్ విక్టరీతో దూసుకుపోతున్న బీజేపీ మళ్లీ ఇదే వేవ్‌ను కొనసాగించాలని ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. ఈ రెండు ఫలితాలను దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ సైతం ఖచ్చితంగా గెలిచి తీరాలన్న కసితో అడగులు వేస్తోంది. ఇప్పటికే రెండు చోట్ల సరైన ఫలితాలు రాక రాష్ట్రంలో క్యాడర్ నిరాశలో ఉన్నందున, సాగర్‌లో ఎలాగైన నెగ్గి తీరాలని వ్యూహాలు పన్నుతోంది. మూడోసారి ముచ్చటగా జరగబోతున్న సాగర్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోకుంటే ప్రజల్లోకి నెగిటివ్ ఫీలింగ్ వెళ్లడమే కాకుండా బీజేపీకి అవకాశం ఇచ్చినట్లే అవుతుందని భావిస్తున్న గులాబీ శ్రేణులు తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.

దుబ్బాకలో మూడుసార్లు ఓడిపోయిన రఘునందన్‌కు అవకాశం ఇచ్చారన్న నెపం, వరదసాయం ఎఫెక్ట్‌తోనే గ్రేటర్‌లో గెలిచిందన్న అపవాదు నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఎలాగైనా సాగర్‌లో కాషాయ జెండాను రెపరెపలాడించాలని కమలనాథులు వ్యూహం పన్నుతున్నారు. సాగర్‌లో విక్టరీ కొట్టి హ్యాట్రిక్ సాధించకుంటే మళ్లీ ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని భావిస్తున్న బీజేపీ.. అక్కడ గట్టి అభ్యర్థిని నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.గ్రేటర్‌ ఎలక్షన్‌లో బడా నేతలను దింపిన విధంగానే, సాగర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే అక్కడ కూడా ఇదే ఫార్ములా పాటించి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున సాగర్‌లో 2014 ఎన్నికల్లో గెలిచి 2018లో ఓడిపోయిన జానారెడ్డి.. ప్రస్తుత ఉపఎన్నిక కోసం బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తన కొడుకు బీజేపీలో చేరుతాడని ప్రచారం జరుగుతున్నా, అవన్నీ ఖండించి కాంగ్రెస్‌లో పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేస్తూ, ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన పాత క్యాడర్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత 40ఏళ్ల నుంచి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న జానారెడ్డి.. ఉపఎన్నికలో తన పవర్ చూపబోతున్నారని టీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇవ్వకుండా గెలిచి స్టేట్‌లో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని నిరూపించడానికి సాగర్ ఉప ఎన్నికను వేదిక చేసుకున్నట్టుగా పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.


Next Story

Most Viewed