కాషాయం, కాంగ్రెస్ ఒక్కటైన వేళ.. కరీంనగర్‌లో హల్‌చల్!

by  |
bjp-and-congress
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జాతీయ పార్టీలు ఏకం అయ్యాయా? రాజకీయ వైరుధ్యంతో వ్యవహరించే ఆ రెండు పార్టీలు ఒక్కటి కావడం ఏంటనుకుంటున్నారా..? ఈ చోద్యం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్‌లో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఆందోళనల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీల నాయకులు కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం కురిక్యాల, కొండన్నపల్లి వరద కాలవపై మహా ధర్నా నిర్వహించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల వల్ల రైతులు మరోసారి భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తద్వారా ఈ ప్రాంత రైతులు వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తున్నదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మేడిపల్లి సత్యంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకాగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావుతో పాటు బీజేపీ నాయకులు కూడా మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ ధర్నాలో జాతీయ స్థాయిలో వైరుధ్యం ఉన్న రెండు పార్టీల నాయకులు పాల్గొనడం విశేషం. మరో వైపున జిల్లాలోని జమ్మికుంటలో ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ విద్యార్థులను మాస్ ప్రమోట్ చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ నాయకులు జమ్మికుంటలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఒకే రోజు యాధృచ్చికంగా రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ల సాధన కోసం కలిసి ఉద్యమాలు చేయడం గమనార్హం.


Next Story

Most Viewed