స్కూళ్ల ఓపెనింగ్‌పై గందరగోళం.. మంత్రి ప్రకటనకు సర్క్యులర్‌కు పొంతనేది..?

by  |
schools-open
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 1వ తరగతి మొదలు పీజీ వరకు అన్ని విద్యా సంస్థలను సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి తగినట్లుగా కొవిడ్ నిబంధనలను పాటించాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. స్కూళ్లన్నీ తెరుస్తున్నందున ఇకపైన ఆన్‌లైన్ క్లాసులు ఉండవని, కేవలం ఆఫ్‌లైన్ (ఫిజికల్) తరగతులు మాత్రమే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో పిల్లలను స్కూలుకు పంపడం నిర్బంధం కాదని, స్వచ్ఛందం మాత్రమేనని పేర్కొన్నారు. ఒకవైపు ఆన్‌లైన్ తరగతులు ఉండవని చెప్తూనే మరోవైపు స్వచ్ఛందం అని నొక్కిచెప్పడం ద్వారా స్కూలుకు హాజరుకాని విద్యార్థులకు బోధన ఎలా అనే సందేహాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు విధిగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాన్ని అందజేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కరోనా భయం కారణంగా పిల్లల్ని స్కూలుకు పంపనట్లయితే నష్టపోయే సిలబస్‌కు తల్లిదండ్రులదే బాధ్యత అనే తీరులో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. స్కూలుకు పంపడం నిర్బంధం కాదని క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పిల్లలకు పాఠాలను క్రమం తప్పకుండా అందించే విషయంలో మాత్రం ఎలాంటి దారి చూపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా భయం కారణంగా పిల్లల్ని స్కూలుకు పంపకపోతే దానికి బాధ్యత తల్లిదండ్రులదేనంటూ ప్రభుత్వం తప్పించుకుంటున్నదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. విద్యా సంస్థలను తెరవాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడంలో ఒకదానికొకటి పొసగని తీరులో నిర్ణయాలు ప్రకటించడం విమర్శలకు దారితీసింది.

ఏకకాలంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు జరగాలి

విద్యా సంస్థలను తెరవడం అవసరమే. కానీ కరోనా భయం కారణంగా పిల్లలను పంపించనప్పుడు ఆన్‌లైన్ ద్వారా పాఠాలను వినే అవకాశం ఉండాలి. పిల్లలను పంపడం స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదని మంత్రి చెప్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ పాఠాలు ఉండవని, కేవలం ఆఫ్‌లైన్ పాఠాలు మాత్రమేనని చెప్తున్నారు. ఈ రెండూ ఒకదానికి మరొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సహజంగా స్వచ్ఛందం అని చెప్పినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని పంపరు. అలాంటివారికి పాఠాలు అందే అవకాశం లేదు. ప్రతీ విద్యార్థికి పాఠాలు చెప్పడం ప్రభుత్వం బాధ్యత. ఏక కాలంలో ఫిజికల్, ఆన్‌లైన్ క్లాసులు కొనసాగాలి. పిల్లలు చదువుకునే హక్కును కోల్పోరాదు. పిల్లలకు వైరస్ సోకకుండా ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఇంతకాలం చదువుకు దూరమైనవారికి యథావిధిగా పాఠాలు అందించే యంత్రాంగాన్ని రూపొందించాలి.
-జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకున్నది

పిల్లల్ని స్కూలుకు పంపించడం తల్లిదండ్రుల ఇష్టం. అది నిర్బంధం కాకూడదు. ఇంకా కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిపోలేదు. కోర్టులే ఆన్‌లైన్ విచారణలు జరుపుతున్నాయి. స్కూళ్లను తెరవడానికి తొందరెందుకు? ప్రైవేటు విద్యా సంస్థలకు లాభాలను చేకూర్చడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదనే అనుమానం కలుగుతున్నది. వైరస్ సోకకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందా? స్కూళ్లు తెరిచారనే సాకుతో ఆన్‌లైన్ పాఠాలను నిలిపేయడం సమంజసం కాదు. స్కూలుకు రానంతమాత్రాన పాఠాలకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నది. ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని లీగల్‌గా ఎదుర్కొంటాం.
-వెంకట్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి



Next Story