‘కరెంట్ బిల్లు ఇంతొస్తుందా.. అంతేగా’

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వేళ కరెంటు బిల్లుల జారీ రాష్ట్రవ్యాప్తంగా గందరగోళానికి దారి తీసింది. మార్చి 23 నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ రెండింటి పరిధిలో మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ బిల్లుల జారీ నిలిపివేశారు. గతేడాది ఈ నెలల్లో వచ్చిన బిల్లులనే వసూలు చేసుకోవడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు టీఎస్‌ఈఆర్సీ ఆదేశాలిచ్చింది. దీంతో డిస్కంలు మార్చి, [&hellip;]</p>

‘కరెంట్ బిల్లు ఇంతొస్తుందా.. అంతేగా’
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వేళ కరెంటు బిల్లుల జారీ రాష్ట్రవ్యాప్తంగా గందరగోళానికి దారి తీసింది. మార్చి 23 నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ రెండింటి పరిధిలో మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ బిల్లుల జారీ నిలిపివేశారు. గతేడాది ఈ నెలల్లో వచ్చిన బిల్లులనే వసూలు చేసుకోవడానికి విద్యుత్ పంపిణీ సంస్థలకు టీఎస్‌ఈఆర్సీ ఆదేశాలిచ్చింది. దీంతో డిస్కంలు మార్చి, ఏప్రిల్ నెలలకు గతేడాది బిల్లులే వసూలు చేశాయి. తాజాగా ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సడలింపులిచ్చిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలలు మూడు నెలలకు కలిపి జూన్ నెల 2వ తేదీ నుంచి కరెంటు మీటర్ రీడింగ్ తీయడం ప్రారంభించారు. అయితే 3 నెలల బిల్లు ఒకేసారి తీయడం కారణంగా స్లాబులు మారిపోయి వాడుకున్న విద్యుత్ కన్నా బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిస్కంలకు ఫిర్యాదులొచ్చాయి.

రాష్ట్రంలో డిస్కంలు ఎల్‌టీ సెగ్మెంట్‌(గృహ, కమర్షియల్)లో 200 యూనిట్లలోపు ఒక రకంగా.. 200 యూనిట్లు దాటి ప్రతి 100 యూనిట్లకు మారిన స్లాబుకు అనుగుణంగా చార్జీలు పెంచి వసూలు చేస్తాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో విద్యుత్ వినియోగానికి ఒకేసారి రీడింగులు తీసి 3తో భాగించడం వలన ప్రతి నెలలో స్లాబు మారిపోయి 3 నెలలకు కలిపి అధిక బిల్లు వస్తోందనేది కస్టమర్ల వాదనగా ఉంది. అయితే ప్రతి వేసవిలోనూ విద్యుత్ వాడకం 35 నుంచి 40 శాతం అధికంగా ఉంటుందని లాక్‌డౌన్ కారణంగా ఈ వేసవిలో అందరూ ఇళ్లలోనే ఉండడంతో కరెంటు వినియోగం మరో 10 నుంచి 15 శాతం పెరిగిందని విద్యుత్ సంస్థలు వాదిస్తున్నాయి. ఎంత వేసవి అయినా మార్చి బిల్లు, మే నెల బిల్లు మధ్య వ్యత్యాసం ఉంటుందని, అన్నింటిని కలిపేయడంతో మొత్తం 3 నెలల బిల్లుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని కస్టమర్లు వాపోతున్నారు. లేదంటే ఎక్కువ వచ్చిన ఒక నెలకు మాత్రమే స్లాబు మారి తమకు డబ్బులు మిగిలేవని కస్టమర్లు పేర్కొంటున్నారు.

200 యూనిట్లు దాటిన కస్టమర్లకు బిల్లు లెక్కేసేటపుడు విద్యుత్ సంస్థలు ప్రత్యేక విధానాన్ని వాడుతాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని నెలలకు రీడింగ్ తీస్తామనేది ముఖ్యం కాదని.. ఎన్నిరోజుల రీడింగ్ తీస్తామనేది ముఖ్యమని అంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలకు గతేడాది బిల్లులు చెల్లించమని చెబితే 40 శాతం కస్టమర్లు అసలు కట్టనే లేదని అందువల్లే వారికి ఎక్కువ బిల్లు వచ్చినట్టు అనిపిస్తోందని చెబుతున్నారు. కొందరు పాత బిల్లులు చెల్లించిన వాళ్లకు ఒకవేళ ఆ మొత్తం సర్దుబాటు కాకుండా ప్రస్తుతం జారీ చేసే బిల్లులో నెట్ అమౌంట్‌లో మళ్లీ వస్తే వారు సమీపంలోని ఈఆర్వో ఆఫీసుకు వెళ్లి సరి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

దీంతో విద్యుత్ బిల్లులపై కొందరు నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన విద్యుత్ మంత్రి, డిస్కంల అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదివారం కోరారు. కేటీఆర్ సూచనతో విద్యుత్ బిల్లులపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ మంత్రి విద్యుత్ సంస్థలు చెబుతున్న విషయాలనే మళ్లీ చెప్పారు. ప్రతీ ప్రాంతంలోని ఉన్న విద్యుత్ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్వో)కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కుల్లో ప్రజలు తమకు విద్యుత్ బిల్లులపై ఉన్న డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. ఏకంగా విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, పలువురు ఎమ్మెల్యేలకే విద్యుత్ బిల్లులపై డౌట్లు వచ్చాయని ఆ బిల్లులపై డిస్కంల అధికారులు శాస్త్రీయ పద్ధతిలో వారి సందేహాలు నివృత్తి చేయడంతో వాడుకున్న విద్యుత్‌కే బిల్లులు వచ్చాయని ఒప్పుకున్నారని తెలిపారు.

Next Story