మైనర్ అత్యాచారం కేసులో డ్రామాలు.. ఏది నిజం.. ఏది అబద్ధం?

381

దిశ, ఎల్బీనగర్: దేశమంతా తల్లడిల్లిపోతున్న సైదాబాద్ గిరిజన బాలిక అత్యాచారం, హత్య కేసు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలిపే ఘటన ఇది. చిన్నారిని చిదిమేసిన మృగాడిని పట్టిస్తే రూ. పది లక్షల బహుమతి అంటూ పోలీస్ శాఖ ప్రకటించింది. కానీ.. రెండు రోజుల ముందే తన ట్విట్టర్ లో హంతకుడిని గంటల్లో పట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఏది నిజం..? హంతకుడిని పట్టుకున్నారా..? లేదా..? ఆ స్థాయిలో ఉన్నవాళ్లే ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే.. బాధితులకు న్యాయమేం జరుగుతుందని జనం ప్రశ్నిస్తున్నారు.

బాలికను అత్యంత పాశవికంగా చంపేసిన నిందితుడు రాజును ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ అంతటా వినిపిస్తోంది. అయితే పోలీసులు ఇంతవరకు అతడ్ని పట్టుకోలేకపోయారు. ఘటన జరిగిన తర్వాత పరారైన రాజు.. ఎక్కడికి వెళ్లాడో ఎటు వెళ్లాడో తెలుసుకోలేకపోయారు. అయితే రాజును పట్టించిన వారికి పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం రెండు గంటల్లో పట్టేస్తామని డీసీపీ ర‌మేష్ రెడ్డి అన్నారు. కానీ.. అతడి జాడ కనిపెట్టలేకపోయారు.

మంత్రి కేటీఆర్ అయితే ఘటన జరిగిన తర్వాత గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారంటూ ట్వీట్ చేశారు. వాడికి శిక్ష ప‌డేలా చేయాల‌న్నారు. రాజును పోలీసులు ప‌ట్టుకోలేద‌నే విష‌యం కూడా తెలియకుండానే కేటీఆర్ పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు, ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు. మంత్రేమో అరెస్ట్ చేశారంటున్నారు.. పోలీసులేమో పట్టుకోలేదు, ఎవరైనా పట్టిస్తే రివార్డు ఇస్తామంటున్నారు. అసలు.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.? కేటీఆర్ చెప్పింది నిజమా..? పోలీసులు చెప్పేది నిజమా..? అనే కన్ఫ్యూజన్ అందరిలో కనిపిస్తోంది. ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..