ఉమ్మడి ఏపీ పవర్ రికార్డు బ్రేక్…

by  |
ఉమ్మడి ఏపీ పవర్ రికార్డు బ్రేక్…
X

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇది ఎంతంటే ఉమ్మడి రాష్ట్ర రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఉమ్మడి ఏపీలో 2014, మార్చి 23న అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. అయితే, శుక్రవారం తెలంగాణలో గణనీయంగా 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదు కావడం గమనార్హం. గత ఏడాది ఇదే రోజు తెలంగాణలో నమోదైన 9770 మెగావాట్ల కంటే శుక్రవారం నమోదైన డిమాండ్ 34 శాతం ఎక్కువని తెలంగాణ ట్రాన్స్‌కో ఛైర్మన్ అండ్ ఎండీ డీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పంటల సాగు, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ వినియోగం పెరగడం వల్లే గరిష్ఠ డిమాండ్ నమోదవుతోందన్నారు. మెట్రో రైలు కోసం 150 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. 13,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైనా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడున్న 5661 మెగావాట్ల విద్యుత్ కంటే శుక్రవారం నమోదైన డిమాండ్ 132.6 శాతం అధికమని తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని సీఎం కేసీఆర్ ముందే ఊహించి సిద్ధంగా ఉండమని చెప్పినందు వల్లే తాము ఎంత విద్యుత్‌నైనా సరఫరా చేయగలుగుతున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగం కూడా ఆర్థికాభివృద్ధి సూచికల్లో ఒకటని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ సగటును మించిందని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటు పెరగినందు వల్ల వాటికీ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

Next Story

Most Viewed