ఈటలకు నోటీసులు.. వాదనలకు చివరి అవకాశం?

by  |
ఈటలకు నోటీసులు.. వాదనలకు చివరి అవకాశం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై మాజీ మంత్రి ఈటల, ఆయన అనుచరులకు నోటీసులు జారీ చేయనుంది. 65 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై కలెక్టర్ హరీష్ నేతృత్వంలోని బృందం రిపోర్టు సమర్పించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(పీఓటీ) చట్టం 1977 సెక్షన్ 4 ప్రకారం కబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేయనున్నారు. ప్రస్తుతానికి వారి దగ్గర సాదాబైనామాల కింద కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపిస్తున్నారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయొద్దన్న నిబంధనల ఉల్లంఘనలపై వారి దగ్గరి నుంచి సంజాయిషీ తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అలాగే పౌల్ట్రీ రంగాన్ని వ్యవసాయంలో భాగమని తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌల్ట్రీ కోసం నిర్మించిన షెడ్లకు నాలా వర్తించదు. అంటే నాలా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఐతే పౌల్ట్రీ షెడ్లతో పాటు నిర్మించిన మిగతా నిర్మాణాలకు నాలా ఫీజు చెల్లించకుండానే నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈటలను అధికారులు తప్పు పట్టారు. పౌల్ట్రీయేతర నిర్మాణాలు ఎంత మేరకు ఉన్నాయో వాటిపైనే చర్యలు తీసుకోకున్నారు. అది కూడా పట్టా భూముల్లో నిర్మించిన విస్తీర్ణం మేరకు నాలా ఫీజు వసూలు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి ‘దిశ’కు తెలిపారు. మిగతా అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అది కూడా నోటీసుల జారీ, వాదనలు విన్న తర్వాతే ఆ ప్రక్రియ కొనసాగనుందన్నారు. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు స్థానిక తహశీల్దార్, ఆర్డీఓలు విధులు నిర్వహిస్తున్నారు.

రెండేండ్ల క్రితమే నోటీసులు

అచ్చంపేట, హఫీజ్ పేట పరిధిలోని ఈ వివాదాస్పద 65 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన అంశంలో రెండేండ్ల క్రితమే కొందరికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఐతే అది మాజీ మంత్రి ఈటల, ఆయన అనుచరులు కొనుగోలు చేయకముందేనా? కొనుగోలు చేసిన తర్వాతనా? అన్న విషయం తేలాల్సి ఉంది. అందుకే మరోసారి అందరికీ నోటీసులు జారీ చేసి మొత్తం విస్తీర్ణాన్ని పీఓటీ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వీలుంది. అలాగే రోడ్డు వేసిన అరకిలో మీటర్ మేరకు ఎన్ని చెట్లు కొట్టేశారన్న విషయంపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాని ప్రకారం కొట్టేసిన చెట్లకు జరిమానా, దాంతో పాటు ఆ సంఖ్యకు రెట్టింపు మొక్కలు నాటి సంరక్షించాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఒకటీ, రెండు రోజుల్లోనే ఏమేం చర్యలు తీసుకుంటారో వెల్లడి కానుంది.


Next Story