ఎవరూ బయటికి రాకూడదు : రంగారెడ్డి కలెక్టర్

by  |
ఎవరూ బయటికి రాకూడదు : రంగారెడ్డి కలెక్టర్
X

దిశ, రంగారెడ్డి: కోవిడ్-19(కరోనా వైరస్) విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. శుక్రవారం కరోనా నివారణ చర్యపై మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఆయన, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలకు విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా..? వస్తే వారు ఎక్కడ ఎక్కడ తిరిగారు. వారికి వైరస్ లక్షణాలు ఉన్నాయా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎంతో కలసి వెళ్లి సర్వే చేయాలని సూచించారు. కరోనా లక్షణాలు తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే వారిని ఐసోలేషన్ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 104 నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఇంటింటికీ సమాచారం కోసం వెళ్లే అధికారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు స్థానిక ఎస్ఐ, సీఐతో కలసి చర్చి, మసీదు, దేవాలయాల మత పెద్దలతో కలిసి తాత్కాలికంగా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉగాది, శ్రీరామ నవమి, జగ్నేకి రాత్ తదితర ముఖ్య పండుగలకు దూరంగా ఉంచేందుకు మత పెద్దలతో కలిసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని అన్నారు.

Tags : rangareddy Collector, Video Conference, corona virus, Home Survey


Next Story