కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రైతులకు సూచనలు

171

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలలో జగిత్యాల జిల్లా కలెక్టర్ గూగులోత్ రవి ఆకస్మికంగా సందర్శించారు. మొదటగా ముత్యంపేట గ్రామంలో ఐకేపీ సెంటర్‌ని సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌కి వెళ్లి వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి సందర్శించి తగు సూచనలు అందించారు.

సాతారం గ్రామంలో ఏర్పాటు చేసిన పంట మార్పిడి ప్రక్రియ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ పాల్గొని రైతులకు తగిన సూచనలిచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ.. యాసంగి పంటలో పండించాల్సిన పంటలపైన రైతులకు అవగాహన ఉండాలని, వరి కాకుండా లాభసాటిగా ఏ పంట అయితే తమ భూముల్లో పండుతాయో ఆ పంటలు వేసి లాభాలు గడించాలని కోరారు. వేసవి కాలం పంటలో ఆరుతడి పంటలు చాలా లాభదాయకమని రైతులకు గుర్తు చేశారు. కొందరు రైతులు సమావేశంలో తమ భూములు తమకు తెలియకుండానే వేరే వారి పైన సాదాబైనామా సమయంలో పడ్డాయని కలెక్టర్ దృష్టికి తీసుకోవడంతో లిఖిత పూర్వకంగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వమని ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

కరోనా థర్డ్ వేవ్ ముప్పు ప్రజలపైన ఎంతో ఉందని మాస్కులు తప్పనిసరిగా వాడాలని, వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడి తప్పనిసరిగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజా శ్రీనివాస్, ఎమ్మార్వో తోట రవీందర్, వ్యవసాయ శాఖ మండల అధికారి లావణ్య, ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి రాకెష్, ముత్యంపేట గ్రామ సర్పంచ్ బొల్లం కృష్ణవేణి, సాతారం సర్పంచ్ బొడ్డు సుమలత-రాజేష్, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.