అస్త్రసన్యాసం.. కేసీఆర్ కేంద్రానికి లొంగాడా!

by  |
అస్త్రసన్యాసం.. కేసీఆర్ కేంద్రానికి లొంగాడా!
X

నిన్నటిదాకా కేంద్రంపై యుద్ధమే అని గంభీర ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ హఠాత్తుగా తన మనసు మార్చుకున్నారా? 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఫెడరల్ ఫ్రంట్, తాజాగా ప్రకటించిన రీజినల్ కాంక్లేవ్ లాంటి ప్రయత్నాలను విరమించుకున్నారా? కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసేవే అంటూ భారత్ బంద్‌కు ప్రత్యక్ష మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? రాజకీయంగా అలసిపోయి ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యమంత్రి బాధ్యతను కేటీఆర్‌కు అప్పజెప్పి క్రియాశీల రాజకీయాల నుంచి తాత్కాలికంగా పక్కకు తప్పుకోవాలనుకుంటున్నారా? ఇది రాజకీయ ఎత్తుగడా లేక కేంద్రానికి లొంగిపోయారా? అనే సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘దేశంలో సంపన్న రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలోనే అని చెప్పుకోవాలి, మన రాష్ట్రం ‘బంగారు తెలంగాణగా మారాలి, టీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వం, మరే రాష్ట్రంలో కనిపించని రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఇక్కడే ఉన్నాయి” అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఇపుడేమో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనడం ద్వారా ఈ ఆరున్నరేళ్లలో సుమారు ఏడున్నరవేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రకటించారు. ఇకపైన ప్రభుత్వం కొనదని ప్రకటించారు. రైతుబీమా కిస్తీ పెరుగుతున్నా ప్రభుత్వం భరిస్తోందని పేర్కొన్నారు. ఇక ఈ భారాన్ని వదిలించుకుంటామని, త్వరలో రైతుబీమాకు మంగళం తప్పదన్న పరోక్ష సంకేతం సీఎం మాటల ద్వారా వ్యక్తమవుతోంది.

కేంద్రంతో యుద్ధం చేయలేకనే వైఖరి మారిందా?

ఢిల్లీ పర్యటనకు మూడు రోజుల ముందు కేంద్ర వ్యవసాయ చట్టాలను తూర్పారబట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హఠాత్తుగా ఆ చట్టాలను అమలు చేయక తప్పదనే ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఎవ్వరికీ అంతుపట్టడంలేదు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో జరిగిన ఏకాంత చర్చలలో ఏదో మతలబు ఉందనే అనుమానాలకు తాజాగా సీఎం చేసిన ప్రకటన బలం చేకూర్చినట్లయింది. కేంద్రానికి లొంగిపోయారా లేక తాత్కాలికంగా ఇలాంటి వైఖరి తీసుకునే రాజకీయ ఎత్తుగడా అనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

దేశాన్ని 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సరైన దిశానిర్దేశం చేయలేకపోయాయని, ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం చూపలేకపోయాయని, పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, అందుకే కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ తరహా కూటమిని ఏర్పాటు చేస్తానని 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు హైదరాబాద్ నుంచే ప్రయత్నాలు మొదలుపెడతానని, డిసెంబరు రెండవ వారంలో రీజినల్ కాంక్లేవ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ రెండూ అర్ధాంతరంగా ఆగిపోయాయి.

కేంద్రంతో యుద్ధం చేస్తానని, అమీతుమీ తేల్చుకుంటానని చేసిన గంభీర ప్రకటనకు బదులుగా ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనక కేసీఆర్ వ్యూహం అంతుచిక్కడం లేదు. కేంద్రంతో యుద్దం చేయలేక తన ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకున్నారా? ఢిల్లీ వెళ్ళడానికి ముందు వరకూ స్పష్టమైన వైఖరితో ఉన్న కేసీఆర్ హఠాత్తుగా యూ టర్న్ తీసుకోవడానికి ఉన్న కారణాలపైనే ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిన కేసీఆర్ భారత్ బంద్ వరకూ కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి ఢిల్లీ పర్యటన తర్వాత మరో విధంగా ఆలోచించడం గమనార్హం.

రైతాంగం సంక్షేమం సంగతేంది?

రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను చాలా గొప్పగా చెప్పుకునే కేసీఆర్ కరోనా సమయంలో గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతులకు చేరువయ్యారు. నియంత్రిత సాగును వానాకాలం సీజన్‌లో అమలుచేసిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సన్న రకం వడ్ల అమ్మకాల విషయంలో హామీ ఇచ్చారే తప్ప అమలుపై మాత్రం దృష్టి పెట్టలేదు. కనీస మద్దతు ధర లభించక రైతులు ఇబ్బంది పడ్డారు. యాసంగి మొదలైనా నియంత్రిత సాగుపై స్పష్టత ఇవ్వలేదు. ఆదివారం మాత్రం ఈసారి కొనుగోలు కేంద్రాలు ఉండవని, నియంత్రిత సాగు వద్దని, రైతులు వారికిష్టమైన పంటలు పండించుకుని వచ్చిన రేటుకు అమ్ముకోవాలని వ్యాఖ్యానించడం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారన్న విమర్శలకు కారణమైంది.

ప్రతీ రైతు ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ అయ్యేంతవరకు నిద్రపోయేది లేదని, సంపన్న రైతులుగా తీర్చిదిద్దేవరకు విశ్రమించేది లేదని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయాలను విస్మరించారు. ‘ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. అమ్మకాలు, కొనుగోళ్ళు ప్రభుత్వ బాధ్యత కాదు’ అని సీఎం ప్రకటించడం రైతుల్లో నిరాశా నిస్పృహలను పెంచింది. రైతుల పట్ల ప్రభుత్వానికి ఇకపైన ఎలాంటి బాధ్యత ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభాలో మూడొంతులు వ్యవసాయంమీద ఆధారపడే కుటుంబాలే అని పదేపదే చెప్పే కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత కాదంటూ తప్పుకోవడంపై భారీ స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి.

కేంద్రంపై నింద మోపే వ్యూహమా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో సమర్ధనీయమైన ధోరణి తీసుకోవడం వెనక రాజకీయ వ్యూహమేమైనా ఉందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ చట్టాల కారణంగా భవిష్యత్తులో రైతులకు జరిగే నష్టానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదని, కేంద్రానిదేననే నెపాన్ని మోపడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా ఉండవచ్చన్న వాదన వినిపిస్తోంది. కొనుగోలు కేంధ్రాల ఏర్పాటు, నియంత్రిత సాగు విధానం రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశాలే అయినా వాటి నుంచి కూడా వెనకడుగు వేయడం ద్వారా రైతులకు జరిగే ఇబ్బందులన్నింటినీ కేంద్రంపై నెట్టడానికి వీలవుతుంది. రాజకీయంగా లబ్ధి పొందడానికి రైతుల్ని పావులుగా వాడుకోవడంపై ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతుల్ని మధ్యలోనే వదిలేయడం ద్వారా జరిగే నష్టాన్ని టీఆర్ఎస్ ఇకపైన ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంస్కరణలన్నింటినీ ఒక్కటొక్కటిగా ఆమోదిస్తున్న టీఆర్ఎస్ ఇకపైన అన్నింటికీ తలూపే నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మనిర్బర్’ ప్యాకేజీలో భాగంగా ఎఫ్ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచుకోడానికి సంస్కరణలకు సై అన్నారు కేసీఆర్. ఇకపైన వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విద్యుత్ సంస్కరణలకు సైతం జై కొట్టే అవకాశాలు లేకపోలేదు. కేంద్రంతో రణమా? శరణమా? అనే అనామానలకు ఆదివారం ప్రగతి భవన్ సమీక్షలో తీసుకున్న నిర్ణయంతో ఆయన ఎటువైపో తేలిపోయింది. ఇక రైతులు రానున్న కాలంలో ఎదుర్కొనే కష్టాలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్, అధికార పార్టీగా టీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. తొందర్లో కేటీఆర్‌ను సీఎం చేస్తారన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఏ మేరకు కలిసొస్తుంది? ఎలాంటి చిక్కులు తీసుకొస్తుందనేదానికి కాలమే సమాధానం చెప్తుంది!


Next Story