‘ఫెయిల్’ ఎందుకు అవుతున్నాం.. హుజురాబాద్‌పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.!

by  |
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మరో 17 రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ క్షేత్ర స్థాయి పరిశీలన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ఐదు నెలలుగా నిరంతరంగా ప్రచారం చేస్తున్నా మెజార్టీ ఓటర్లను పార్టీకి అనుకూలంగా మార్చుకోలేకపోయామని గుర్తించిన అధిష్టానం లోతుగా అధ్యయనం చేసే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో హుజురాబాద్ బై పోల్ విషయంలో టీఆర్ఎస్ అధినేత సీరియస్‌గా పర్యవేక్షణ చేస్తున్నట్టుగా సమాచారం. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీకి అనుకూలత రాకపోవడానికి కారణాలేంటీ, ఎలాంటి చర్యలు తీసుకుంటే పట్టు సాధించగలుగుతాం అన్న విషయాలను తెలుసుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. స్పెషల్ టీంలను రంగంలోకి దింపి మరీ ఈ వివరాలను సేకరించనున్నట్టు సమాచారం.

ఫెయిల్యూర్స్‌పై ప్రత్యేక దృష్టి..?

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించకపోవడం వెనక ఉన్న కారణాలను ప్రధానంగా ఆరా తీయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి ప్రజలను ప్రభావితం చేసేందుకు పలు రకాల చర్యలు తీసుకున్నా ఎందుకు సక్సెస్ కాలేకపోయామన్న విషయం గురించే తెలుసుకునేందుకు స్పెషల్ టీంలు సర్వే జరపనున్నట్టుగా సమాచారం. అన్నీ పార్టీల నాయకులూ టీఆర్ఎస్‌లో చేరినప్పటకీ ప్రజల్లో సానుకూలత రాకపోవడం వెనక కారణాలు ఏంటీ, సానుకూలత రావాలంటే ఏం చేయాలి అన్న కోణంలో ప్రజల నాడి తెలుసుకోనున్నారు.

ప్రధాన లక్ష్యం ఇదే..

హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని ఆధిక్యత సాధించాలన్న లక్ష్యంతో పావులు కదపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చేపట్టాల్సిన ప్రచారం తీరు, ఇక్కడి ప్రజలకు కల్పించాల్సిన భరోసా ఏంటీ అన్నది తేలాలని అధిష్టానం చూస్తున్నట్టుగా సమాచారం.

పథకాల ప్రభావం ఎంత..?

హుజురాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల పార్టీకి జరిగిన లాభమెంతా, నష్టమెంతో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దళిత బంధు పథకంతో లబ్ధిదారుల్లో నెలకొన్న అభిప్రాయాలతో పాటు, ఇతర సామాజిక వర్గాలు ఏం అనుకుంటున్నాయో కూడా తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఆయా వర్గాల్లో నిరాశ ఉన్నట్టయితే కారణాలు ఏంటీ అన్న విషయంపై కూడా తెలుసుకోనున్నట్టు సమాచారం.

సర్వేలతో ఆరా..

ఓటరు నాడి ఎలా ఉంది. నాటికి, నేటికీ వారిలో మార్పు వచ్చిందా లేదా అన్న విషయంపై కూడా ఆరా తీసేందుకు మరో వైపున సర్వేలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. సర్వే రిపోర్టులను ఆధారం చేసుకొని ఇందుకు తగ్గట్టుగా నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలన్నదే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకొని అధిష్టానం పావులు కదిపేందుకు సమాయత్తం అవుతున్నట్టు స్పష్టమవుతోంది.


Next Story

Most Viewed