సిరిసిల్ల ఖిల్లాలో కేసీఆర్.. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభం

by  |
Kcr
X

దిశ, సిరిసిల్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. 12.36 నిమిషాలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చేరుకున్న సీఎం డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి ఆరుగురు లబ్దిదారులకు ఓనర్ షిప్ సర్టిఫికెట్లు అందజేశారు. రూ. 21 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ భవనాన్ని, ఇంటర్నేషనల్ స్కూల్, జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం 87.37 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 1320 గృహాల సముదాయానికి పైలాన్ ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు అన్నల్ దాస్ రుచిత, గొట్టిముక్కల కవిత, కైతి ఎల్లవ్వ, కారంపూడి పద్మ, చేర్యాల రేణుక, వేముల కవితకు గృహాలకు సంబంధించిన ఇంటిహక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గృహ సముదాయంలోని బ్లాక్ నెంబర్ 36లో 3వ నెంబర్‌లో ఉన్న అన్నల్ దాస్ కవిత శ్రీహరి దంపతుల ఇంట్లో.. కేసీఆర్ పూజలు నిర్వహించి దంపతులకు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్బంగా దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించి దంపతులతో గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం గృహ నిర్మాణాల సముదాయాన్ని పరిశీలించారు. తొలుత ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు.

తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్‌(ఇన్‌స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్)ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. డ్రైవింగ్ స్కూల్ తెలంగాణకే మణిహారమని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణమని అన్నారు. సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఐడీటీఆర్‌ ఏర్పాటు చేసినట్లు, తెలంగాణలోనే తొలి సెంటర్‌గా ఇది ఖ్యాతిగాంచిందని ఆయన తెలిపారు.

దక్షిణ భారత దేశంలో ఇది నాలుగోదని, రూ.16.48 కోట్లతో నాలుగేండ్లలోనే దీని నిర్మాణం పూర్తి చేశామన్నారు. మండేపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో 58,165 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసినట్లు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలు, సూపర్‌ టెక్నాలజీతో నెలకొల్పిన ఈ కేంద్రంలో నెలకు 400 మందికిపైగా తర్ఫీదు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హెవీ వెహికల్స్ డ్రైవర్స్‌కు గుణాత్మక హెవీ డ్రైవింగ్ పద్దతులను అందించడం ద్వారా తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల అవసరాలను తీర్చుతుందని ఆయన తెలిపారు.

శిక్షణ స్కూల్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ కార్యాలయం, సిమ్యూలేటర్ గదిలోని పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు టి. భానుప్రసాద్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, టీఎస్ ఆప్కాబ్ చైర్మన్ కొండూరి లక్ష్మణ్ రావు, రవాణా శాఖ కమిషనర్ ఎం.ఎన్. రావు, జిల్లా కలెక్టర్ డి. కృష్ణ భాస్కర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Siricilla2



Next Story

Most Viewed