నా ఫొటోతో సంబంధం లేదు.. కేసీఆర్ సంచలన ఆదేశాలు

317
cm-kcr-dailitha

దిశప్రతినిధి, కరీంనగర్ : దళితబంధు లబ్ది ప్రతి ఒక్కరికీ చేకూరాల్సిందేనని, రైతుబంధు పథకంలా అందరికీ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిపిన సమీక్షా సమావేశంలో పథకం గురించి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది సీఎంను పొగడటం, మీ ఫొటో పెట్టుకోవాలని కామెంట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పగొళ్లకైనా ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చుడే.. నా ఫొటో పెట్టుకోకపోతే ఇవ్వమా ఏందీ.? అని ప్రశ్నించారు.

అందరికీ పథకాన్ని వర్తింపజేసుడేనని స్పష్టంచేశారు. పథకం యొక్క లక్ష్యం నెరవేరాలన్నదే తన ఉద్దేశ్యమని. ఇందులో భేషజాలు ఉండవని సీఎం అన్నారు. దళితులు ఆర్థిక అబివృద్ధి చెందినప్పుడే పథకం ముఖ్య ఉద్దేశ్యం నెరవేరినట్టవుతుందని సీఎం అన్నారు. తాను బంగ్లాదేశ్‌కు చెంది రచయిత రాసిన ఓ పుస్తకం చదివి దళితుల అభ్యున్నతి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందోనన్న విషయంపై స్పష్టత తెచ్చుకున్నానన్నారు.

సెప్టెంబర్ 3లోగా సర్వే కంప్లీట్..

పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సెప్టెంబర్ 3 వరకు సర్వే పూర్తవుతుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగానే ఆయా కుటుంబాల నుండి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. లబ్దిదారులు ఏఏ వ్యాపారాలు ఎంపిక చేసుకున్నారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని సీఎం స్పష్టం చేశారు.

రక్షణ నిధి..

దళిత బంధు లబ్దిదారుల నుండి 1 శాతం నిధులను నిలిపి వేసి రక్షణ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. అందరి నుండి సేకరించిన 1 శాతం ద్వారజమ అయిన డబ్బుకు అంతే మొత్తంలో డబ్బును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యాపారాలు అనుకూలించక ఎవరైనా నష్టం చవిచూస్తే ఆ నిధి నుండి సేకరించి వారికి భరోసా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, దళిత బంధు స్కీం ద్వారా లబ్ది పొందిన వారు వ్యాపారంలో నష్టపోకుండా ఉండేలా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాల్సి ఉందని సీఎం ఆదేశించారు. వారికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వ్యాపార అభివృద్దికి తోడ్పాటును అందించాలన్నారు. సర్వేలో లబ్దిదారులకు ఏ వ్యాపారంపై మక్కువ ఉందో తెలుసుకుని వారి కుటుంబ స్థితిగతులు, ఇతరాత్ర విషయాలను పరిగణనలోకి తీసుకుని సరైన యూనిట్ ఎదో కూడా అధికారులు సూచించి దళితుల ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. లేనట్టయితే దళిత బంధు లక్ష్యానికి గండి పడే ప్రమాదం ఉన్నందున ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవలని సీఎం కోరారు.

పశువైద్యం అందుబాటులో ఉంచాలి : కడియం

ex deputy cm kadiyam srihari

దళిత బంధు ప్రోగ్రాం ద్వారా లబ్ది చేకూర్చిన వారిలో పాల ఉత్పత్తి వైపు మొగ్గు చూపుతున్న వారి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవల్సి ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. డైరీలను ఏర్పాటు చేసిన వారిని దృష్టిలో పెట్టుకుని వెటర్నరీ వైద్యులను ఇతరాత్ర సిబ్బందిని నియమిస్తే బావుంటుందన్నారు. దీనివల్ల డైరీల్లో ఉండే పశువులకు సత్వరమే వైద్య సేవలందించినట్టు అవుతుందని కడియం అభిప్రాయ పడ్డారు. మార్కెటింగ్ కు సంబందించిన అంశాల్లోనూ సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. కడియం శ్రీహరి అభిప్రాయాన్ని ఏకీ భవించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తగ్గట్టుగా పశు వైద్యులను, సిబ్బందిని పెంచెేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.

రిజర్వేషన్లలో వాటా అవసరం: ఆరెపల్లి మోహన్

దళిత బంధు లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా వ్యాపారాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని.. అయితే, అందులో దళితులకు వాటా ఉంటే బావుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సూచించారు. వైన్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులు వంటి ప్రభుత్వం లెసెన్స్ ఇచ్చే విధానం అమలు చేస్తున్న వాటిల్లో దళితుల కోసం ప్రత్యేకంగా వాటా ఉండటం వల్ల కాంపిటీషన్ తగ్గి వారు వ్యాపారం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అలాగే, డైరీలు ఏర్పాటు చేసుకునే వారికి బావి, మోటరు, షెడ్డు వంటివి నిర్మించే విషయంలోనూ అధికారులు చొరవ చూపిస్తే వారికి మరింత భరోసానిచ్చినట్టు అవుతుందున్నారు. దళితులకు ఇస్తున్న డబ్బులోంచే వీటిని ఖర్చు చేయాలని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్టయితే లబ్దిదారులకు త్వరితగతిన పనులు పూర్తవుతాయని చెప్పారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే వ్యాపారాల్లో దళితులకు రిజర్వేషన్ వాటా కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో జరిపే సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ అంశాన్ని నోట్ చేసుకుని మీటింగ్‌లో చర్చకు తీసుకురావాలని సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..