శాశ్వత హక్కు కల్పించడానికే భూ సర్వే !

by  |
శాశ్వత హక్కు కల్పించడానికే భూ సర్వే !
X

దిశ, ఏపీ బ్యూరో: ఎలాంటి అవకతవకలకు వీల్లేకుండా సమగ్ర భూసర్వే చేపట్టాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సీఎం సమీక్షించారు. శాశ్వత భూ హక్కు కల్పించేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో చేపట్టిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్​ మాట్లాడుతూ జనవరి 1న సమగ్ర భూసర్వే రాష్ర్టమంతా చేపట్టాలని చెప్పారు. అనుకున్న గడువులోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి గనుక సర్వేయర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తొలుత సమగ్ర భూసర్వేకు సంబంధించి అధికారులు నివేదికను సమర్పించారు. మొత్తం 1.22లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వివరించారు.



Next Story