ముప్పు ముంగింట్లో పగడపు దిబ్బలు

by  |
ముప్పు ముంగింట్లో పగడపు దిబ్బలు
X

దిశ, ఫీచర్స్ : సముద్రపు అడుగుభాగంలో కొంత భాగాన్నే ఆక్రమించిన పగడపు దీవుల వల్ల బిలియన్‌కు పైగా ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా వీటికి ముప్పు ఏర్పడిందని, 2009 తర్వాతి నుంచి ఇప్పటివరకు పగడపు దిబ్బల్లో 14% కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మానవులు గ్రీన్‌హౌజ్ వాయువులను నియంత్రించగలిగితే కొన్ని పగడపు దిబ్బలనైనా రక్షించవచ్చని సూచించింది.

‘ఆమ్లీకరణ, వెచ్చని సముద్ర ఉష్ణోగ్రతలు, ఓవర్ ఫిషింగ్, కాలుష్యం, టూరిజం, పేలవమైన తీరప్రాంత నిర్వహణ’ వంటి కారణాలతో పగడపు పర్యావరణ వ్యవస్థకు ముప్పు కలుగుతోంది. 1978 నుంచి 2019 వరకు నాలుగు దశాబ్దాలుగా 300 మంది నెట్‌వర్క్ సభ్యులు సేకరించిన కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్‌వర్క్ (GCRMN) నివేదిక ద్వారా ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. 73 రీఫ్-బేరింగ్ దేశాల్లో 12,000 కంటే ఎక్కువ సైట్‌ల నుంచి దాదాపు 2 మిలియన్ పరిశీలనలు ఇందులో ఉన్నాయి. పగడపు దీవుల పరిస్థితిపై 13 సంవత్సరాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇదే కాగా, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే విపత్తు పరిణామాలను ఇది నొక్కిచెప్పింది. అయితే కొన్ని పగడపు దిబ్బలను గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించుకోవడం ద్వారా రక్షించవచ్చని పేర్కొంది. సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు(SST) పెరగడం మూలాన పగడపు బ్లీచింగ్ సంఘటనలు పగడపు నష్టానికి కారణమయ్యాయని నివేదిక తెలిపింది.

కాగా దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, తూర్పు ఆసియా, పశ్చిమ హిందూ మహాసముద్రం, ఒమన్ గల్ఫ్‌లోని పగడపు దీవుల్లోనే ఎక్కువ పగడపు దీవులు దెబ్బతిన్నాయి. 2010 నుంచి ప్రపంచంలోని పగడపు దిబ్బలపై ఆల్గే మొత్తం సుమారు 20 శాతం పెరిగిందని, దీనికి ముందు ఆల్గే కంటే పగడాలు రెండు రెట్లు ఎక్కువగా ఉండేవి. ఈ మార్పు సముద్ర ఆవాసాలను ప్రభావితం చేస్తుండటంతో పాటు తక్కువ జీవవైవిధ్యానికి కారణమవుతుంది. అంతేకాదు పర్యావరణ వ్యవస్థను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.

పగడపు దిబ్బలు అందించే వస్తువులు, సేవల విలువ సంవత్సరానికి $ 2.7 ట్రిలియన్లుగా అంచనా వేయగా.. నివేదిక ప్రకారం ఇందులో కోరల్ రీఫ్ టూరిజం విలువ $ 36 బిలియన్లు ఉంది. అయితే ఆర్థికంగా ప్రపంచానికి కీలక వనరుగా ఉన్న పగడపు దీవులు ముప్పును ఎదుర్కొవడంతో నష్టనివారణ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచదేశాలు కలిసి పనిచేయకపోతే శతాబ్దం చివరినాటికి పగడపు దీవులన్నీ బ్లీచింగ్ అవుతాయని యునైటెడ్ నేషన్స్ ఎన్వరాన్మెంట్ ప్రగ్రామ్ (UNEP) తెలిపింది.


Next Story

Most Viewed