టీఆర్‌ఎస్‌లో వర్గ పోరు.. పార్టీ అక్కడ మసకబారిపోతుందా?

by Sridhar Babu |   (  Updated:2021-06-27 20:48:41  IST  )

<p>దిశ, భద్రాచలం: భద్రాచలం టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ నిస్తేజం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ భద్రాచలం మండల కమిటీ రద్దు చేసి ఏడాది అవుతున్నా.. కొత్త కమిటీని ఏర్పాటు చేయలేని స్థితిలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. పార్టీలో అంతర్గత గ్రూపులు, నాయకుల నడుమ విభేదాలు నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తున్నాయి. భద్రాచలం ప్రాంత అభివృద్ధి గురించి అంతగా దృష్టి పెట్టని టీఆర్ఎస్ అధినాయకత్వం [&hellip;]</p>

trs-flag 1
X

దిశ, భద్రాచలం: భద్రాచలం టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ నిస్తేజం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ భద్రాచలం మండల కమిటీ రద్దు చేసి ఏడాది అవుతున్నా.. కొత్త కమిటీని ఏర్పాటు చేయలేని స్థితిలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. పార్టీలో అంతర్గత గ్రూపులు, నాయకుల నడుమ విభేదాలు నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తున్నాయి. భద్రాచలం ప్రాంత అభివృద్ధి గురించి అంతగా దృష్టి పెట్టని టీఆర్ఎస్ అధినాయకత్వం కనీసం పార్టీ మీదనైనా ప్రత్యేక శ్రద్ధ చూపించకపోతే వచ్చే 2023 ఎన్నికలనాటికి నియోజకవర్గంలో తెరాసకి మళ్ళీ గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గ్రూపు గొడవల గులాబీ..

భద్రాచలం టీఆర్ఎస్ పార్టీ మూడు గ్రూపులు, నాలుగు వర్గాలుగా కొనసాగుతోంది. తుమ్మల, పువ్వాడ, పొంగులేటి గ్రూపులుగా భద్రాద్రి లీడర్లు పనిచేస్తుండగా.. పువ్వాడ గ్రూపులోనే బాలసాని వర్గంగా కొంత క్యాడర్ పనిచేస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పదవి చేపట్టి, భద్రాచలం నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చూస్తున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు పార్టీ క్యాడర్‌ని సమన్వయం చేయలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైద్య వృత్తి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వెంకట్రావు గిరిజనుడు కావడంతో రాజకీయ రంగంలో ఆయన కంటే సీనియర్లు అయిన గిరిజనేతర నాయకులు వెంకట్రావు మాట వినడం లేదని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిష్యుడు కావడంతో తుమ్మల, పువ్వాడ వర్గాల నుంచి ఆశించిన సహకారం అందడం లేదనేది నిజం. 2018 ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు ఓటమికి పార్టీలో గ్రూపులే కారణమనేది కాదనలేని నిజం. అధిష్టానం నిర్ణయం కంటే రాజకీయ గురువుగా భావించే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటే డాక్టర్ తెల్లం వెంకట్రావుకి వేదమని పార్టీ శ్రేణులు భావిస్తారు. వెంకట్రావుని పొంగులేటి వర్గంగానే పరిగణిస్తారు. ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం పర్యటనకి వచ్చినపుడు పొంగులేటి ఇంటికి వెళ్ళి ఆయనతో ఏకాంతంగా సమావేశమైనట్లు క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సమన్వయ లోపమే పార్టీకి శాపం

భద్రాచలం నియోజకవర్గంలో సమన్వయ లోపమే టీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారింది. 2014 ఎన్నికల్లో కేవలం అప్పటి తెలంగాణ ఉద్యమకారుల అండతో భద్రాచలం అసెంబ్లీ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మానె రామకృష్ణ సుమారు పది వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయి. తుమ్మల గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో బాలసాని సహా తుమ్మల అనుచరులంతా గులాబీ గూటికి చేరారు. వలసవాదుల చేతికి పెత్తనం మారడంతో కనీసం పార్టీ పదవులు కూడా దక్కకుండా భద్రాచలం నియోజకవర్గంలో ఉద్యమకారులు అణిచివేయబడ్డారు. పార్టీలోకి వలసల కారణంగా రెండవసారి మానెకి టికెట్ దక్కలేదు. తుమ్మల గ్రూపుకి చెందిన రసూల్, బాలసాని అప్పట్లో రెండు వర్గాలుగా పనిచేశారు. తుమ్మల మంత్రిగా ఉన్నంతకాలం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆయన వెంటే నడిచారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెంది అనూహ్యంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కి మంత్రి పదవి లభించడంతో బాలసాని అటువైపు వెళ్ళారు. పువ్వాడ గ్రూపుగా పనిచేస్తున్న బాలసాని భద్రాచలం నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు.

క్యాడర్‌లో నిరాశానిస్పృహలు

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఆశపడిన గులాబీ శ్రేణులకు నిరాశ కలుగుతోంది. భద్రాచలం నియోజకవర్గంలో తుమ్మల, పువ్వాడ (బాలసాని) గ్రూపుల మూలంగా ఎలాంటి పదవులు కూడా దక్కడం లేదని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 1969 ఉద్యమ నాయకులు, రిటైర్డ్ లెక్చరర్ తిప్పన సిద్ధులు వంటి పార్టీ సీనియర్లకి కూడా ఎలాంటి పదవులు దక్కడంలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన భద్రాచలం దేవస్థానం కమిటీలో చోటుకోసం ఆశపడుతున్నారు. పార్టీలో పాతతరం ఉద్యమకారులను పట్టించుకొనేవారు లేరు. ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా.. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ పదవుల కోసం ఇతర పార్టీల నుంచి ఆశతో వచ్చిన వలసవాదులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

అధికార పార్టీపై అసంతృప్తి

అధికార టీఆర్ఎస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెన్సీ ప్రజలు గులాబీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ భద్రాచలం ఏజెన్సీని వణికిస్తోంది. నియోజకవర్గంలో సుమారు వంద మంది దాకా చనిపోయారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలవైపు కన్నెత్తి చూసిన టీఆర్ఎస్ నాయకులు లేరు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రాధాన్యమని పదేపదే చెప్పే ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ సైతం కరోనా సమయంలో నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. భద్రాచలంలో కరోనా మృతుల అంత్యక్రియలు చేస్తూ సీపీఎం ప్రజల హృదయాలను దోచుకుంది. సీపీఎం, సీపీఐ పార్టీలు కరోనా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నంటే ఉండి సేవలు అందిస్తుంటే.. అధికార టీఆర్ఎస్ నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందనే విమర్శలు కోకొల్లలు. ఆ పార్టీ తరపున మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మొక్కుబడి పర్యటనలు చేశారనే ఆరోపణలు పార్టీ శ్రేణులలోనే వినిపిస్తున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ప్రకటించిన సీఎం కెసిఆర్.. ఆ నిధులు విడుదల చేసేలా పార్టీ భద్రాచలం ప్రాంత నాయకులు ఒత్తిడి చేయడంలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకుల వైఖరి ఇలాగే కొనసాగితే భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కి గడ్డుకాలమే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

Next Story